ప్రాజెక్టులా.. పైసల్లేవ్‌!

No funds allocated for irrigation projects in Telangana - Sakshi

సాగునీటి ప్రాజెక్టు పనుల్లో రూ.5,659 కోట్ల బిల్లుల పెండింగ్‌

నెలకు రూ.900 కోట్లు కూడా ఇవ్వని వైనం

ప్రాజెక్టుల పనులపై తీవ్ర ప్రభావం

సాక్షి, హైదరాబాద్‌ : ‘సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాంశం. అందుకు తగ్గట్టే బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు కేటాయించాం. ప్రతినెలా రూ.2 వేల కోట్లు చెల్లిస్తాం. నిధుల కొరత లేకుండా చేస్తాం’అని పలు సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటన అమల్లోకి వచ్చేసరికి చతికిలపడుతోంది. బడ్జెట్‌లో భారీ కేటాయింపులతో నీటిపారుదల శాఖను అగ్రస్థానంలో కూర్చోబెట్టినా, నిధుల విడుదలలో మాత్రం ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. ప్రతినెలా రూ.2 వేల కోట్లు కేటాయించాల్సి ఉన్నా రూ.1,000 కోట్లకు మించి విడుదల చేయట్లేదు. దీంతో సాగు నీటి ప్రాజెక్టుల బిల్లులన్నీ పేరుకుపోతున్నాయి. ఇప్పటివరకు రూ.5,659 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.  

ఖరీఫ్‌కు నీళ్లొచ్చేనా..!
సాగు నీటి ప్రాజెక్టుల పరిధిలో రూ.5,659 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోనే రూ.1,681కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి. వచ్చే ఖరీఫ్‌ నాటికి పూర్తి చేసి నీళ్లిచ్చే ప్రాజెక్టుల జాబితాలో ఉన్న దేవాదులలో రూ.424 కోట్లు, కల్వకుర్తిలో రూ.308 కోట్లు, నెట్టెంపాడులో రూ.77 కోట్లు, వరద కాల్వలో రూ.196 కోట్లు మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్థిక శాఖను నీటిపారుదల శాఖ అధికారులు అడిగినప్పుడల్లా ఏదో రూ.200 నుంచి రూ.300 కోట్లు విడుదల చేస్తున్నారు. గత ఆగస్ట్‌ నుంచి ఇప్పటి వరకు నెలకు రూ.400 కోట్లకు మించి ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయట్లేదు.

ఈ నెల ఉన్నతాధికారుల ఒత్తిడితో రూ.1,000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చినా, రెండ్రోజుల కింద రూ.400 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొంది. వీటిని ఏ ప్రాజెక్టులకు సర్దాలో తెలియక నీటి పారుదల శాఖ తలలు పట్టుకుంది. నిధుల లేమితో పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, సీతారామ, ఉదయ సముద్రం వంటి ప్రాజెక్టుల భూసేకరణకు పూర్తిగా బ్రేక్‌లు పడగా, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్సారెస్పీ–1, ప్రాణహిత, ఛనాఖా–కొరట, ప్రాజెక్టుల పనుల్లో వేగం తగ్గిపోయింది. మిషన్‌ కాకతీయకు సైతం రూ.530 కోట్ల మేర బిల్లులు పేరుకుపోవడంతో రెండో, మూడో విడతలో చేపట్టిన చెరువులు, మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణ పనులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.

గత ఏడాది ‘లెక్క’నే!
గతేడాదిలో సైతం సాగునీటికి రూ.25 వేల కోట్లు కేటాయించినా చివరికి రూ.14,918.19 కోట్లకే పరిమితమైంది.  పాలమూరు–రంగారెడ్డి పరిధిలో కొలిక్కి రాని భూసేకరణ, సహాయ పునరావాస ప్రక్రియ, కోర్టు కేసులతో ప్రాజెక్టు పరిధిలో అనుకున్న మేర పనులు జరగలేదు. ప్రాజెక్టుకు రూ.7,860 కోట్లు కేటాయించినా చివరికి రూ.2,851.88 కోట్లకు సవరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సైతం రూ.6,280 కోట్లు కేటాయించినా రూ.2,280 కోట్లకే పరిమితం చేశారు. దేవాదుల, కంతనపల్లి వంటి ప్రాజెక్టుల పరిధిలోనూ ఇదే జరగడంతో బడ్జెట్‌ కాస్తా రూ.10 వేల కోట్ల మేర తగ్గింది.  నెలకు గరిష్టంగా రూ.1,000 కోట్ల చొప్పున ఖర్చు చేసినా ఈ ఏడాది మొత్తం ఖర్చు రూ.15వేల కోట్లు దాటడం గగనమే.  

కేటాయింపులే ఘనం..
సాగునీటి ప్రాజెక్టుల్లో మెజార్టీ పనులను వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం, గత ఏడాది మాదిరే ఈ ఏడాది రూ.25వేల కోట్ల బడ్జెట్‌ కేటాయింపులు చేసింది. నెలకు రూ.2వేల కోట్లకు తగ్గకుండా నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ఘనంగా బడ్జెట్‌ కేటాయింపులు జరిగినా, అనుకున్న స్థాయిలో నిధులు విడుదల కావట్లేదు. 9 నెలల్లో రూ.18వేల కోట్లు విడుదల చేయాల్సి ఉన్నా రూ.11,722 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. వీటిలో బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.4,015 కోట్ల రుణాలు పక్కనపెడితే ప్రభుత్వం నేరుగా రూ.7,707కోట్లే విడుదల చేసింది. ఈ లెక్కన ప్రభుత్వం ప్రతినెలా కేటాయించిన మొత్తం రూ.900 కోట్ల కన్నా తక్కువే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top