పేరుకే రైల్వే స్టేషన్లు!

No Facilities In Railway Stations Around Adilabad District - Sakshi

కనీస వసతులు కరువు..

ప్యాసింజర్‌ రైళ్లకే పరిమితం

ఆగని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

అవస్థలు పడుతున్న ప్రయాణికులు

తలమడుగు(బోథ్‌) : బోథ్‌ నియోజకవర్గంలో తలమడుగు, ఉండమ్‌ గ్రామంలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ రెండు స్టేషన్లు ప్యాసింజర్‌ రైళ్లకే పరిమితమయ్యాయి. ఇక్కడ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టింగ్‌ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. గతంలో తాంసీ, తలమడుగు మండల ప్రజల రావాణా సౌకర్యార్థ్థం రైలు ప్రయాణం మాత్రమే ఉండేది. ఉండమ్, తలమడుగు రైల్వే స్టేషన్లను పాలకులు పట్టించుకోక పోవడంతో స్టేషన్లలో కనీస వసతులు కరువయ్యాయి. 

1976లో నుంచి అసౌకర్యాలే..
1976లో తలమడుగు గ్రామం మీదుగా మహరాష్ట్ర కిన్వాట్‌ మీదుగా రైల్వే లైన్‌ ఏర్పాటు చేశారు. బోథ్‌ నియోజకవర్గంలో బోథ్, నేరడిగొండ, బజార్‌హత్నూర్, ఇచ్చోడ, గుడిహత్నుర్, సిరికొండ, బీంపూర్, తాంసీ, తలమడుగు, మండలాలు ఉన్నాయి. వాటిలో తలమడుగు రైల్వే స్టేషన్‌ మాత్రం తాంసీ, తలమడుగు, భీంపూర్, మండలాల ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేశారు. మూడు మండలాలకు చెందిన ప్రజలు తరచూ హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్ర సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈస్టేషన్‌ మీదుగా దీక్షభూమి, పాట్నా, నాందేడ్‌ స్పెషల్, నందిగామ్, కృçష్ణ, సంత్రగాంచి, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వెళ్తుంటాయి, కేవలం ప్యాసింజర్‌ రైళ్లు రెండు మాత్రమే ఇక్కడ అగుతాయి. బస్సు చార్జీలు ప్రయాణికులకు భారమవుతుండడంతో నిరుపేద, మధ్యతరతి ప్రజలు రైళ్లోనే ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ ఇక్కడ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగకపోవడంతో దూరప్రాంతాలకు వెళ్లే వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. 

పట్టించుకోని అధికారులు..
ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపాలని, రైల్వే స్టేషన్లలో సౌకర్యాలు మెరుగుపర్చాలని గతంలో పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌ తలమడుగులోని రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. తాగునీటి వసతి, ప్రాయాణికులు కూర్చోవడానికి ఎలాంటి సౌకర్యాలు లేవని స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఎండాకాలం ఎండలో, వర్షాకాలంలో తడుస్తూ రైలు ప్రయాణం చేస్తున్నామని స్థానికులు వాపోతున్నారు. నిత్యం వందల సంఖ్యలో ప్రాయణికులు స్టేషన్‌ నుంచి ప్రాయాణం సాగిస్తున్నా అధికారులు వసతులు కల్పించడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆపకపోవడంతో జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లి తిరిగి ఎక్స్‌ప్రెస్‌ రైలులో తలమడుగు, ఉండమ్, రైల్వే స్టేషన్ల మీదుగానే వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో డబ్బులు, సమయం వృథా అవుతోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఎంపీ గోడం నగేశ్‌ చొరవ తీసుకుని తలమడుగులో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని, ఉండమ్, తలమడుగు రైల్వే స్టేషన్లలో కనీస వసతులు కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు. 

ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపాలి
తలమడుగు రైల్వే స్టేషన్‌లో ప్యాసింజర్‌ రైళ్లు మాత్రమే అపుతున్నారు. మిగతా రైళ్లు ఇక్కడ ఆపడం లేదు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఆక్కడి నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లి అక్కడి నుంచి వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ రైళ్లు నిలిపితే ఎలాంటి సమస్యలు ఉండవు. గతంలో నాందేడ్, నుంచి రైల్వే ఉన్నధికారులు వచ్చి పరిశీలించి వెళ్లారు తప్ప సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు.    – లింగాల రాజన్న, తలమడుగు

కనీస సౌకర్యాలు కల్పించాలి
రైల్వె స్టేషన్‌లో ప్రాయాణికులకు కూర్చోడానికి కుర్చీలు తాగేందుకు నీటి సౌకర్యం లేవు. దీంతో ఇక్కడకు వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ కాలంలో ఎండను, వర్షాకాలంలో వానను తట్టుకుని ప్రయాణం చేస్తున్నాం. రైల్వే స్టేషన్‌కు రావాలంటే రోడ్డు పూర్తిగా బురదమయంగా ఉంటుంది. బురదలోంచి నడిచి వస్తున్నాం. కనీసం తాగునీటి సౌకర్యం, కనీస సౌకర్యాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.      – శరత్‌యాదవ్, తాంసీ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top