వద్దంటే ఇంజనీరింగ్ సీట్లు! | No, Engineering seats | Sakshi
Sakshi News home page

వద్దంటే ఇంజనీరింగ్ సీట్లు!

Jun 29 2014 12:30 AM | Updated on Sep 2 2017 9:31 AM

ఉన్న రోగానికి మందెక్కువేస్తే.. కొత్త రోగం పట్టుకున్నట్లు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) వ్యవహారం కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది.

తెలంగాణలో 15 వేలకుపైగా అదనపు సీట్లు, ఆరు కొత్త కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతి
సీట్లు, కాలేజీలు వద్దని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా పట్టించుకోని వైనం

 
హైదరాబాద్: ఉన్న రోగానికి మందెక్కువేస్తే.. కొత్త రోగం పట్టుకున్నట్లు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) వ్యవహారం కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఇప్పటికే ఎక్కువైపోయాయి బాబో అన్నా వినకుండా.. తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో అదనపు సీట్లకు ఏఐసీటీఈ అనుమతులు ఇస్తూనే ఉంది. విద్యార్థులు చేరక వందల సంఖ్యలో కళాశాలలు మూసివేతకు దగ్గరవుతోంటే.. మరిన్ని కొత్త కాలేజీలకు అనుమతులు ఇస్తోంది. ఇప్పటికే విద్యార్థులు చేరతారనే ఆశలేక ఈ విద్యా సంవత్సరంలో తమకు అడ్మిషన్లు చేయవద్దని 17 ఇంజనీరింగ్ కళాశాలలు విజ్ఞప్తి చేసుకున్నాయి కూడా. ఇంజనీరింగ్‌లో సీట్లు వద్దంటున్నా గత ఏడాది పలు కొత్త కాలేజీలకు అనుమతులు ఇచ్చిన ఏఐసీటీఈ.. ఈ సారి భారీ సంఖ్యలో అదనపు సీట్లకు, ఆరు కొత్త కాలేజీలకు అనుమతులు ఇచ్చింది. మొత్తంగా తెలంగాణలో ఉన్న కాలేజీల్లో 15 వేలకు పైగా అదనపు సీట్లతో పాటు.. 1,680 సీట్లతో ఆరు కొత్త కాలేజీలు ఈ ఏడాది ప్రారంభం కానున్నాయి. వీటన్నింటినీ కౌన్సెలింగ్‌లో చేర్చేందుకు త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే యనుంది కూడా. అయితే కొత్త కాలేజీలు, అదనపు సీట్లు అవసరం లేదని, అనుమతులు ఇవ్వొద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట స్వయంగా ఏఐసీటీఈకి లేఖ రాసింది. అయినా ఏఐసీటీఈ దానిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికే కొన్నేళ్లుగా విద్యార్థులు చేరక పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కళాశాలలు మూతపడ్డాయి. ప్రస్తుత 2014-15 విద్యా సంవత్సరంలోనూ 17 కాలేజీలు తమకు ప్రవేశాలు అవసరం లేదని విజ్ఞప్తి చేసుకోవడం గమనార్హం.

విభజన, ‘ఫీజు’తో మరింత దెబ్బ..  

రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాలేజీల్లోనే సీట్లు నిండే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటివరకు ఏటా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు దాదాపు 40 వేల మంది వరకు తెలంగాణలోని వివిధ కాలేజీల్లో చేరేవారు. కానీ వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వబోమని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఈసారి వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి నెలకొంది. దీనివల్ల తెలంగాణ ప్రాంతంలో చాలా కాలేజీలు మూతపడే అవకాశం కనిపిస్తోంది. అసలు గత ఏడాది 32 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరకపోగా.. ఒకటి నుంచి 5 మందిలోపు మాత్రమే విద్యార్థులు చేరినవి 14 కాలేజీలున్నాయి. మరో 14 కాలేజీల్లో  ఆరు నుంచి పది మందిలోపు విద్యార్థులే చేరగా, 19 కళాశాలల్లో ఇరవై మందిలోపే విద్యార్థులు చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో 15 వేలకు పైగా సీట్లు పెరగడంతో మరిన్ని కాలేజీల మూసివేత తప్పకపోవచ్చనే ఆందోళన నెలకొంది.

గత ఏడాది సీట్లు, ప్రస్తుత సీట్ల వివరాలు..

గత ఏడాది తెలంగాణలోని 330 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,66,845 సీట్లు అందుబాటులో ఉండగా, ఈసారి 319 కాలేజీల్లో 1,84,779 సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. గత ఏడాది కౌన్సెలింగ్‌లో పాల్గొన్న 330 కాలేజీల్లో 17 కాలేజీలు ఈసారి తమకు ప్రవేశాలు అవసరం లేదని పేర్కొన్నాయి. అ యినా మూడు ప్రైవేటు, మూడు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ 367 ఇంజనీరింగ్, 183 బీఫార్మసీ, 457 ఎంబీ ఏ, 147 ఎంసీఏ కాలేజీలకు కూడా అనుమతులు ఇచ్చింది.

http://img.sakshi.net/images/cms/2014-06/81403982297_Unknown.jpg
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement