సమస్యల స్వాగతం..

NIT non teaching staff waiting for promotions

నేడు నిట్‌కు కొత్త డైరెక్టర్‌గా ఎన్‌వీ.రమణారావు రాక

పేరుకుపోయిన సమస్యలు పరిష్కరిస్తారని విద్యార్థుల ఆశాభావం

ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న నాన్‌ టీచింగ్‌ సిబ్బంది

కాజీపేట అర్బన్‌: జాతీయ సాంకేతిక కళాశాల (నిట్‌)ఏడాదిన్నరగా ఇన్‌చార్జి డైరెక్టర్‌ పాలనలో కొనసాగుతోంది. దీంతో కళాశాలలో సమస్యలు పేరుకుపోయి పాలన గాడితప్పింది. ఈ నేపథ్యంలో సోమవారం రానున్న కొత్త శాశ్వత డైరెక్టర్‌కు సమస్యలు స్వాగతం పలుకనున్నాయి. కళాశాలలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని ఈనెల 13న విద్యార్థులు నిట్‌ ప్రధాన గేటు ఎదుట ధర్నా చేసిన విషయం తెలిసిందే.  

మౌలిక సౌకర్యాల కొరత..
వరంగల్‌ నిట్‌లో బీటెక్, ఎంటెక్, పీజీ, పీహెచ్‌డీ విభాగాల్లో సుమారు 6వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడి విద్యార్థులు తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంటున్నారు. బయట నుంచి మినరల్‌ వాటర్‌ను కొని విద్యార్థులకు సరఫరా చేస్తున్నారు. కళాశాల ఆవరణ, వసతి గృహ ఆవరణల్లో పారశుధ్యం లోపించింది. ఫలితంగా ప్రాంగణమంతా దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రతి కళాశాలలో ఉచిత వైఫై సౌకర్యం కల్పించాల్సి ఉన్నా అది అమలు కావడం లేదు. దీంతో విద్యార్థులు సాంకేతిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నాణ్యమైన భోజనం లభించకపోవడంతో అవస్థలు పడుతున్నారు.  

పదోన్నతులపై డీపీసీలో చర్చించాలి ..
నిట్‌లో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగ భర్తీకి సన్నాహాలు చేస్తున్న క్రమంలో డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషనల్‌ కమిటీతో చర్చించి పదోన్నతులు కల్పించాలని నాన్‌టిచింగ్‌ సిబ్బంది డిమాండ్‌ చేస్తున్నారు. ఇరవై ఎళ్లుగా పదోన్నతులు లేకుండా నాన్‌టిచింగ్‌ సిబ్బంది కొనసాగుతున్నారు. సుమారు 230 మంది నాన్‌ టీచింగ్‌ సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా వారిలో కనీసం వంద మందికైనా ప్రమోషన్లు కల్పించాల్సి ఉంది.

వంద కోట్లు వెనక్కి వచ్చేనా...
బాలికల వసతి నిట్‌కు పెద్ద సమస్య అవుతోంది. మూడు వందల మందికి ఉండాల్సిన హాస్టళ్లో సుమారు వెయ్యి మంది బస చేస్తున్నారు. వీరిలో కొంత మందిని గెస్ట్‌ హౌస్‌లో ఉంచుతున్నారు.  సమస్యను పరిష్కరించేందుకు కేంద్రమానవ వనరుల మంత్రిత్వ శాఖ బాలికల వసతి గృహ నిర్మాణానికి రూ. వంద కోట్లు మంజూరు చేసింది. శాశ్వత చైర్మన్, డైరెక్టర్, బోర్డు సభ్యులు లేకపోవడంతో నిధులు వెనక్కి వెల్లిపోయాయి. కొత్త డైరెక్టర్‌  నిధులు వెనక్కి తెప్పించి బాలికల వసతి గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. 

అందుబాటులో లేని పీఆర్వో
పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ (పీఆర్వో) నిట్‌లో అందుబాటులో లేక పోవడం చర్చనీయాంశంగా మారింది. పనిఒత్తిడి కారణంగా గతంలో పనిచేసిన పీఆర్వో స్వయంగా విధుల నుంచి తప్పుకోగా ప్రస్తుతం ఎంబీఏ హెచ్‌ఓడీ పీఆర్వోగా వ్యవహరిస్తున్నారు. పీఆర్వో విద్యార్థులకు, తల్లిదండ్రులు, ఇతర సిబ్బందికి అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న డైరెక్టర్‌ ఈ సమస్యలు పరిష్కరిస్తారనే ఆశతో విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top