తనకు పెళ్లయినప్పటికీ ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధింపులు ఆగకపోవడంతో మనస్తాపం చెందిన నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది.
శామీర్‌పేట్: తనకు పెళ్లయినప్పటికీ ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధింపులు ఆగకపోవడంతో మనస్తాపం చెందిన నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. మండలంలోని లక్ష్మాపూర్ తండాకు చెందిన పత్లావత్ అనసూయ(20)కు రెండు నెలల క్రితం మెదక్‌జిల్లా చిన్నశంకరంపేట్ మండలం గువ్వలపల్లి తండాకు చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది.
కాగా, అనసూయను గతంలో మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన షాకీర్ ప్రేమ పేరుతో వేధించేవాడు. పెళ్లయినప్పటికీ ఆమెను గువ్వలపల్లికి వెళ్లి వేధించసాగాడు. ఇటీవల పుట్టింటికి వచ్చిన తనకు షాకీర్ వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెందిన అనసూయ సోమవారం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీలు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు షాకీర్ పరారీలో ఉన్నాడని తెలిపారు.


