పోలీసు శాఖలో కొత్త జోన్లు, రేంజ్‌లు | New zones and ranges in the police department | Sakshi
Sakshi News home page

పోలీసు శాఖలో కొత్త జోన్లు, రేంజ్‌లు

Oct 24 2017 1:36 AM | Updated on Oct 24 2017 1:36 AM

New zones and ranges in the police department

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త జోన్ల ఏర్పాటు అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసు శాఖలోనూ జోన్ల సంఖ్య పెంచాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం పోలీసు శాఖలో హైదరాబాద్, వరంగల్‌ రెండు జోన్లు ఉన్నాయి. వీటికి ఐజీ స్థాయి అధికారులు నేతృత్వం వహిస్తున్నారు.

ఒకవేళ ప్రభుత్వం మరో మూడు కొత్త జోన్లను ఏర్పాటు చేస్తే పోలీసు శాఖలోనూ జోన్ల ఏర్పాటు తప్పదని.. అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డీజీపీ అనురాగ్‌ శర్మ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర పోలీసు ముఖ్య కార్యాలయంలో జరిగిన ఐపీఎస్‌ అధికారుల భేటీలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించారు.

జోన్లను బట్టి కొత్త రేంజ్‌లు
ప్రస్తుతం పోలీసు శాఖలోని రెండు జోన్ల కింద హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్‌ పోలీస్‌ రేంజ్‌లు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు ఒక్కో రేంజ్‌ కింద రెండు, మూడు జిల్లాల పోలీసు యూనిట్లు ఉండగా.. ప్రస్తుతం ఆరు నుంచి ఎనిమిది జిల్లాల పోలీసు యూనిట్లు ఉన్నాయి.

అయితే ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా మరో మూడు జోన్లను ఏర్పాటు చేయాలని భావిస్తుండడంతో.. పోలీసు శాఖ పరిధిలోనూ మరో మూడు జోన్లు, వాటి కింద రెండు చొప్పున రేంజ్‌ల ఏర్పాటు అవసరం ఉంటుందని అధికారుల భేటీలో డీజీపీ పేర్కొన్నారు. దాంతో రాష్ట్రం మొత్తంగా ఐదు జోన్లు, 10 రేంజ్‌లు ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

అంతా రాష్ట్ర కేడరే!
పోలీసు శాఖలో కానిస్టేబుల్, హెడ్‌ కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై ర్యాంకు వరకు అధికారులు, సిబ్బందిని కూడా రాష్ట్ర కేడర్‌గా గుర్తించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని కూడా అధికారులను డీజీపీ ఆదేశించారు. ఇందులో కానిస్టేబుల్, హెడ్‌ కానిస్టేబుల్, ఏఎస్సైలను ఆయా రేంజ్‌ల పరిధిలో వినియోగించుకోవాలని భేటీలో నిర్ణయించారు.

పాత జిల్లాల ప్రకారం ఒక రేంజ్‌ కింద రెండు మూడు జిల్లాలున్నాయి. కానిస్టేబుళ్లను ఆ జిల్లాల పరిధిలో బదిలీ చేసేలా అధికారాలను డీఐజీలకు అప్పగించాలని నిర్ణయించారు. ఇక పోలీసు శాఖలో రాష్ట్రం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని ఒకే సీనియారిటీ జాబితాను డీజీపీ కార్యాలయం తయారుచేయాలని ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. మరోవైపు ఇప్పటివరకు ఎస్సై స్థాయి అధికారుల నియామకం రేంజ్‌ల పరిధిలో జరిగింది.

వాటి పరిధిలోని జిల్లాల్లోనే ఎస్సైలు పనిచేయాల్సి ఉండేది. తాజాగా ఎస్సైలను రాష్ట్ర కేడర్‌గా పరిగణనలోకి తీసుకోనుండడంతో.. వారిని రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లాలోనైనా పనిచేయించుకునేలా విధానాలు రూపొందించనున్నట్టు డీజీపీ పేర్కొన్నారు. ఇక ఇన్‌స్పెక్టర్లు జోన్‌ పరిధిలో పనిచేసేవారు.. వారిని కూడా రాష్ట్రవ్యాప్తంగా వినియోగించుకునేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.


నేటి సమావేశాన్ని బట్టి..
జోన్ల విభజనకు సంబంధించి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక భేటీ నిర్వహించనున్నట్టు డీజీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. జోన్ల విధానంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తే.. ఆ జోన్ల సంఖ్యను బట్టి తాము పోలీసు శాఖలో ఎన్ని జోన్లు, ఎన్ని రేంజ్‌లు ఏర్పాటు చేసుకోవాలన్నది తేలుతుందని డీజీపీ అనురాగ్‌ శర్మ తెలిపారు. ఏయే జిల్లా ఏయే జోన్‌ కిందకు, ఏయే రేంజ్‌ పరిధిలోకి వెళ్తుందన్న దానిపై మరింత కసరత్తు చేయాల్సి ఉంటుందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement