47 రిజర్వాయర్లు.. 16 టీఎంసీలు!

New reservoirs for Extra water reserves of Kalvakurthi Lift Irrigation - Sakshi

     కల్వకుర్తి ఎత్తిపోతల అదనపు నిల్వల కోసం కొత్త రిజర్వాయర్లు 

     రూ.4,175 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం 

     పెంచిన నీటి కేటాయింపు, ఆయకట్టుకు అనుగుణంగా ప్రణాళిక 

సాక్షి, హైదరాబాద్‌: పాత మహబూబ్‌నగర్‌ జిల్లాలో 4 లక్షలకు పైగా ఎకరాలకు ఆయకట్టునిచ్చే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో అదనపు నీటి నిల్వలకు అనుగుణంగా కొత్త రిజర్వాయర్లు నిర్మించనున్నారు. కల్వకుర్తి కింద పెరిగిన నీటి కేటాయింపులకు అనుగుణంగా గరిష్ట నీటి నిల్వలకు వీలుగా 47 రిజర్వాయర్లు నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 16 టీఎంసీల సామర్థ్యంతో వీటిని నిర్మించేలా ప్రణాళిక సిద్ధమవ్వగా ఇందుకు రూ.4,175.28 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.  

4 టీఎంసీల నుంచి 16 టీఎంసీలకు.. 
శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నుంచి 25 టీఎంసీల మిగులు జలాల ను తీసుకుంటూ 3.4 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని 2005లో చేపట్టారు. ఇం దులో భాగంగానే 4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లను నిర్మించారు. ఎల్లూరు రిజర్వాయర్‌లో 0.35 టీఎంసీ, సింగోటం 0.55, జొన్నలబొగుడలో 2.18, గుడిపల్లి గట్టు రిజర్వాయర్‌లో 0.967 టీఎంసీల నీటి నిల్వ రిజర్వాయర్లున్నాయి.  రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టు నీటి వాటాను 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచారు. నీటిని తీసుకునే రోజులను 90 నుంచి 120 రోజులకు పొడగించారు. ఆయకట్టును సైతం 4,23,416 ఎకరాలకు పెంచారు. పెంచిన ఆయకట్టు, పెరిగిన నీటి కేటాయింపులకు అనుగుణంగా రిజర్వాయర్లు పెరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తొలినుంచీ చెబుతూ వస్తోంది.

వరద వచ్చినపుడు లిఫ్టు చేసి నిల్వ చేసుకునేందుకు అవకాశం లేకపోవటంతో కొత్త రిజర్వాయర్లపై సర్వే చేయించింది. మొత్తంగా 20 టీఎంసీలతో 53 రిజర్వాయర్లకు సర్వే నిర్వహించాలని భావించినా, 6 చోట్ల ప్రజా వ్యతిరేకతతో అది సాధ్యం కాలేదు. ఇక మిగతా 47 చోట్ల మాత్రం మొత్తంగా 16.11 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణానికి అనుకూలంగా ఉందని తేల్చింది. ఇందులో 13.064 టీఎంసీల సామర్థ్యమున్న 38 రిజర్వాయర్లను వనపర్తి, నాగర్‌ కర్నూల్, రంగారెడ్డిలో ప్రతిపాదించింది. ఇక ఆయకట్టు లేకున్నా నిల్వల కోసం మరో 9 రిజర్వాయర్లను 3.055 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదిం చింది. గొల్లపల్లి రిజర్వాయర్‌లో గరిష్టంగా 2.81 టీఎం సీలు ప్రతిపాదించగా, మిగతావన్నీ 0.50 టీఎంసీ కన్నా చిన్నవే.  

భూసేకరణకే రూ.1,276 కోట్లు.. 
ఇక ఈ 47 రిజర్వాయర్ల నిర్మాణంతో ఏకంగా 22,332 ఎకరాల మేర ముంపు ప్రభావం ఉండనుంది. అలాగే భూసేకరణ అవసరాలకు రూ.1,276 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు లెక్కగట్టారు. రిజర్వాయర్ల మట్టికట్టల నిర్మాణానికి రూ.2,371కోట్లు, సర్‌ప్లస్‌ వియర్స్‌ నిర్మాణానికి మరో రూ.237 కోట్లు, లింకు కాల్వల నిర్మాణానికి మరో రూ.49కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. మొత్తంగా వీటి నిర్మాణానికి రూ.4,175 కోట్లు వ్యయం అవుతుందని తేల్చారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top