నవంబర్‌లో కొత్త రేషన్ కార్డులు | new ration card in novamber month | Sakshi
Sakshi News home page

నవంబర్‌లో కొత్త రేషన్ కార్డులు

Oct 13 2015 2:24 AM | Updated on Oct 2 2018 8:49 PM

గ్రేటర్ హైదరాబాద్‌లో ఆహార భద్రత (రేషన్) కార్డుల జారీకి రంగం సిద్ధమైంది.

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో ఆహార భద్రత (రేషన్) కార్డుల జారీకి రంగం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం పాత కార్డులను రద్దు చేసి ఆహార భద్రత కింద రేషన్ కార్డులు మంజూరు చేసిన ప్రభుత్వం... తాజాగా వాటికి సంబంధించిన కొత్త కార్డుల జారీకి సన్నాహాలు చేస్తోంది. గులాబీ రంగులో ఉండే కార్డుపై తెలంగాణ లోగో తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఫొటోలు ఉంటాయి.ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో నవంబర్ నెలలో కార్డులు జారీ చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులు యోచిస్తున్నారు.

ఈసారి యూవిక్ పేపర్‌తో కార్డులు ఉంటాయి. కేంద్ర ఆహార భద్రతా చట్టం, రాష్ట్ర పరిధిలోకి వచ్చే లబ్ధిదారులతో పాటు అంత్యోదయ లబ్ధిదారులందరికీ ఒకేలాంటి యూవిక్ కార్డులు జారీ కానున్నాయి. గతంలో జారీ చేసే కార్డులతో పోలిస్తే వీటి ఖర్చు చాలా తక్కువ. యూవిక్ పేపర్ చించినా చిరగదు. కాల్చినా తగలబడదు. నీటిలోనూ తడువదు. దీనిపై ఉన్న వివరాల్లో ఎలాంటి మార్పులైనా సులభంగా చేసుకోవచ్చని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
 
గ్రేటర్‌లో 13.95 లక్షల కార్డులు
గ్రేటర్ హైదరాబాద్ పౌర సరఫరాల విభాగం పరిధిలో 13.95 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. అందులో హైదరాబాద్ లోని తొమ్మిది సర్కిల్స్‌లో 8,17,410, రంగారెడ్డి అర్బన్‌లోని మూడు సర్కిల్స్‌లో 5,77,618 కార్డులు ఉన్నాయి. వాస్తవంగా ఇప్పటికే కొత్త కార్డులు జారీ కావాల్సి ఉంది. ఆహార భద్రత నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సిందేనని కేంద్రం తేల్చి చెప్పడంతో ఆలస్యమైంది.

కేంద్ర , రాష్ట్ర పరిధిలోకి వచ్చే లబ్ధిదారుల జాబితాలను వేర్వేరుగా అధికారులు తయారు చేశారు. ప్రస్తుతం ఆహార భద్రత చట్టం కింద కేంద్రం 4కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తుండగా... రాష్ట్రం దానికి అదనంగా మరో రెండు కిలోలను కలిపి కిలో రూపాయికి పంపిణీ చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర కోటా కిందకు వచ్చే వారికి ఎలాంటి తేడాలు లేకుండా సరుకులు సరఫరా జరుగనున్నందున ఒకేలాంటి గులాబీ యూవిక్ కార్డులు అందజేయనున్నారు.
 
కొత్త రేషన్ కార్డుల జారీతో లబ్ధిదారుల కుటుంబాలకు డేటా స్లిప్ భారం తప్పనుంది. ఇప్పటి వరకు ఆన్‌లైన్ డేటా స్లిప్ కోసం నెలకు రూ.10 చొప్పున రూ.136.5 లక్షల వరకు భారాన్ని భరించారు. పది నెలల క్రితం ఆహార భద్రత కార్డులు మంజూరు చేసిన  ప్రభుత్వం కనీసం కూపన్లు కూడా జారీ చేయకుండా ఆన్‌లైన్‌లో కార్డు డేటాను పొందు పర్చి చేతులు దులుపుకుంది.

ప్రతినెలా ఆన్‌లైన్ ద్వారా డేటా స్లిప్ తీసుకొని చౌక ధరల దుకాణంలో సమర్పిస్తే తప్ప రేషన్ అందని పరిస్థితి నెలకొంది. లబ్ధిదారులు డేటా స్లిప్ కోసం అదనపు భారం భరించారు. మరోవైపు డీలర్లు ప్రైవేటు కార్డుల పేరిట రూ.50 నుంచి రూ.100 వరకు దండుకున్నారు. తాజాగా కార్డులు జారీ కానుండటంతో లబ్ధిదారుల కుటుంబాల్లో సంతోషం వ్యక్త మవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement