36 ‘పేట’ జిల్లాపై  అభ్యంతరాలు

New District Narayanpet On Objections - Sakshi

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో మరో కొత్త ఏర్పాటుకు చకచకా అడుగులు పడుతున్నాయి. నారాయణపేట జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌ 30న జీఓ 534ను విడుదల చేసిన విషయం విదితమే. ఈ మేరకు ముప్ఫై రోజుల్లోగా అభ్యంతరాలు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా అభ్యంతరాలు తెలిపేందుకు గడువు గురువారం ముగిసింది. మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక విభాగానికి నారాయణపేట జిల్లాకు సంబంధించి 36 అభ్యంతరాలు అందాయి. వీటిని పరిశీలిస్తున్న అధికారులు రెండు రోజుల్లోగా తుది నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశముంది. ఆ వెంటనే జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుందని తెలుస్తోంది.

కోయిల్‌కొండ నుంచే అత్యధికం 
నారాయణపేట జిల్లాను ప్రస్తుత డివిజన్‌ పరిధిలోని మండలాలతో ఏర్పాటుచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నారాయణపేట రెవెన్యూ డివిజన్‌లోని నారాయణపేట, దామరగిద్ద, మద్దూర్, కోస్గి, మక్తల్, కృష్ణా, మాగనూర్, ఊట్కూర్, నర్వ, మరికల్, ధన్వాడలతో పాటు మహబూబ్‌నగర్‌ రెవెన్యూడివిజన్‌లోని కోయిలకొండ మండలంతో కలిపి జిల్లా ఏర్పాటుకు జీఓ విడుదల చేశారు. ఈ మేరకు అభ్యంతరాలను ఆహ్వానించగా.. ఎక్కువగా కోయిల్‌కొండ మండలానికి సంబంధించినవే వచ్చినట్లు సమాచారం. మొత్తం 36 అభ్యంతరాలు అధికారులకు అందాయి. ఇందులో కోయిల్‌కొండ మండలాన్ని మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే కొనసాగించాలన్న డిమాండ్‌తో ఎక్కువ మంది అభ్యంతరాలు సమర్పించినట్లు సమాచారం. ఈ మేరకు అభ్యంతరాల పరిశీలనకు జాయింట్‌ కలెక్టర్, డీఆర్వోతో కూడిన కమిటీ ఏర్పాటుచేయగా.. రెండో రోజుల్లో పరిశీలన పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే జిల్లా ఏర్పాటు ప్రకటన జారీ చేయనున్నారు. ఇదంతా ఒకటి, రెండు రోజుల్లో పూర్తికానుందని సమాచారం.

నేడు కలెక్టర్‌ రాక 
జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ శుక్రవారం నారాయణపేటకు రానున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయంలో జరిగే అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొని జిల్లా ఏర్పాటు అంశంపై చర్చించే అవకాశముంది. తొలుత కలెక్టర్‌ పట్టణంలోని బీసీ కాలనీలోని రేషన్‌ దుకాణం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు రేషన్‌ బియ్యం సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అ తర్వాత సత్యనారాయణ చౌరస్తా నుంచి సుభాష్‌రోడ్‌లోని మార్కండేయ దేవాలయం సమీపం వరకు కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలిస్తారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయానికి చేరుకుని సమీక్షించనున్నారు.

భూములు, భవనాల గుర్తింపు  
తాజా అసెంబ్లీ ఎన్కినలకు ముందు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు నూతన జిల్లాగా నారాయణపేట ఆవిర్భవించబోతోంది. ఈ మేరకు జిల్లా ఏర్పాటుకాగానే అధికారిక కార్యకలాపాలు నిర్వర్తించేందుకు కావాల్సిన కార్యక్రమాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్త జిల్లాలో కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన స్థలాలు, తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటుకు భవనాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే సర్వే నిర్వహించిన అధికారులు ప్రభుత్వ స్థలాలను గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే, కొత్త కార్యాలయాల నిర్మించేలోగా ప్రస్తుతం కార్యాలయాల ఏర్పాటుకోసం ప్రైవేట్‌ భవనాల యాజమానుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా పెద్దసంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. జిల్లా ఏర్పాటుపై ప్రకటన రాగానే కార్యాలయాలను ఎంపిక చేయనున్నారు. 
ఇదేకాకుండా కొత్త జిల్లాకు కావాల్సిన ఉద్యోగుల వివరాలను సేకరించే పని కూడా పూర్తిచేసినట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top