రవాణా శాఖకు కాంట్రాక్టర్ల కుచ్చుటోపీ

New angle in Singareni Coal Transport Scam - Sakshi

సింగరేణి బొగ్గు రవాణా స్కాంలో కొత్తకోణం 

31,37, 49 టన్నుల నిబంధన తప్పించుకునేందుకు ఆర్‌సీల మార్ఫింగ్‌ 

అన్‌లాడెన్‌ వెయిట్‌ను మారుస్తున్న 80 శాతం మంది ట్రాన్స్‌పోర్టర్లు 

ఒరిజినల్‌ ఆర్‌సీ ప్రకారం ట్రాన్స్‌పోర్టర్లు రారంటున్న అధికారులు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: లారీల రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్‌సీ)లను కలర్‌ జిరాక్స్‌ల ద్వారా ఏమార్చి సింగరేణి సంస్థకు భారీ నష్టాన్ని కలిగిస్తున్న కాంట్రాక్టర్లు రవాణా శాఖను నిలువునా మోసం చేస్తున్నారు. లారీలు, టిప్పర్ల రిజిస్ట్రేషన్‌ సమయంలోనే ఆ శాఖ సిబ్బందితో కుమ్మక్కై నెట్‌ వెయిట్‌ను తగ్గించి రికార్డు చేయించే కాంట్రాక్టర్లు ఓవర్‌లోడ్‌ నిబంధనలను అధిగమించేందుకు అక్రమ మార్గాల వైపు మళ్లినట్లు తేలింది. ఆర్‌సీలో లారీ బరువును ఒక టన్ను నుంచి మూడు టన్నుల వరకు తగ్గించడం ద్వారా అంతే మొత్తానికి అధిక సరుకును రవాణా చేసుకోవచ్చనేది ట్రాన్స్‌పోర్టర్ల లెక్క. దీనికోసం ఎంచుకున్న అక్రమ మార్గ మే ఆర్‌సీలో ‘అన్‌లాడెన్‌ వెయిట్‌’ను మార్చడం. సింగరేణిలోని 11ఏరియాల్లోని గనుల నుంచి సీహెచ్‌పీ, డిస్పాచ్‌ పాయింట్లకు బొగ్గు రవాణా చేస్తున్న వేలాది లారీల్లో 80 శాతానికి పైగా ఇదే తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు సింగరేణి అధికారులే ఒప్పుకుంటుండటం గమనార్హం. 

ఆర్‌టీఏ చట్టాలు కాగితాలకే ... 
12 టైర్ల లారీ 31 టన్నుల బరువుతో మాత్రమే రోడ్డు మీదికి రావాలి. అలాగే 14 టైర్ల లారీ 37 టన్నులకు మించి బరువు ఉండకూడదు. అంటే 14 టైర్ల లారీ నెట్‌ వెయిట్‌ 12.250 టన్నులు ఉందనుకుంటే.. 24.750 టన్నుల సరుకును మాత్రమే రవాణా చేయాలి. టైర్ల సంఖ్యను బట్టి 49 టన్నుల వరకు రవాణా చేసే లారీలు సింగరేణి ట్రాన్స్‌పోర్టర్ల వద్ద ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఇచ్చిన సడలింపుల ప్రకారం నెట్‌ వెయిట్‌ కన్నా 5 శాతం అటూఇటుగా బరువును పెంచుకోవచ్చు. తద్వారా ఒక టన్నుకు పైగా అదనంగా రవాణా చేసుకునే వెసులుబాటు లభించింది. అయితే సింగరేణి బొగ్గు రవాణాలో ఏర్పడ్డ పోటీ వల్ల లారీల యజమానులు ఒక టన్ను/కిలోమీటరుకు అతి తక్కువ మొత్తానికి (రూ.5 వరకు) టెండర్‌లో కోట్‌ చేసి, రవాణా కాంట్రాక్టులు దక్కించుకుంటున్నారు.

ఆర్‌సీ ప్రకారం 14 టైర్ల వాహనం నెట్‌వెయిట్‌ 10–11 టన్నుల మధ్యలో ఉంటుంది. అదే 14 టైర్ల వాహనం బరువు 12.250 టన్నులకు అటూఇటుగా ఉంటుంది. టైర్ల సంఖ్య పెరిగే కొద్దీ వాహనాల బరువుతో పాటు క్యారింగ్‌ కెపాసిటీ (సీసీ) కూడా పెరుగుతుంది. అయితే తక్కువ ధరకు టెండర్లు దక్కించుకున్న బడా ట్రాన్స్‌పోర్టు కాంట్రా క్టర్లే ఈ అక్రమాలకు తెరలేపారు. అందులో భాగంగానే ఒరిజినల్‌ ఆర్‌సీలను జిరాక్స్‌ చేసి, కంప్యూటర్‌ ద్వారా ట్రక్‌ నెట్‌ వెయిట్‌ను ఒకటి నుంచి మూడు టన్నుల వరకు తగ్గించి దందా సాగిస్తున్నారు. దీంతో 12.250 టన్నుల నెట్‌వెయిట్‌ లారీ 9 టన్నులకు, 17 టన్నుల లారీ 15 టన్నులకు తగ్గిపోయింది. సాధారణంగా ఎలాంటి యాక్సెసరీస్‌ (అదనపు హంగులు) లేకుండా చూసి తక్కువ బరువుతో రిజిస్ట్రేషన్‌ చేయించే యజమానులు ఆర్‌సీ వచ్చిన తరువాత అదనపు ఆకర్షణలు జోడించడం జరుగుతుంది. దీనికి తోడు ఆర్‌సీని మార్ఫింగ్‌ చేసి నెట్‌ వెయిట్‌ను మూడు టన్నులు అంతకు మించి తగ్గించడం వల్ల రోడ్డుపై ఓవర్‌లోడ్‌తో లారీ వెళ్తుంది.

ఇది రవాణా శాఖ నిబంధనలకు పూర్తి విరుద్ధం. ప్రామాణిక బరువు కన్నా క్వింటాలు ఎక్కువ లోడ్‌తో రోడ్డెక్కే వాహనాలను ఓవర్‌లోడ్‌తో జరిమానాలు విధించే రవాణా శాఖ అధికారులు సింగరేణిలో మాల్‌ప్రాక్టీస్‌ చేసి, ఆర్‌సీనే తిరగరాసి తిరుగుతున్న లారీల గురిం చి పట్టించుకోవడం లేదు. శ్రీరాంపూర్‌ ఏరియాలో గనుల నుంచి సీహెచ్‌పీలకు తిరిగే 60 ట్రక్కుల్లో 25 వరకు ఒకే కంపెనీకి చెందినవి కాగా, అవన్నీ ఆర్‌సీలను మార్చివేయడం గమనార్హం. ఇక్కడ ఆర్‌సీలను మార్చేసినట్లు గుర్తించిన 39 లారీలకు తోడు మరో 15 వరకు ఇదే రీతిన బొగ్గు రవాణా చేస్తున్నట్లు సింగరేణి అధికారులు నిరా ్ధరించారు. కొత్తగూడెం, భూపాలపల్లి, రామగుండం, బెల్లంపల్లి, మందమర్రి, ఇల్లం దు ఏరియాల్లో కూడా వందలాది లారీలు ఇదే తరహా లో ఆర్‌సీలను మార్చి సింగరేణిని, రవాణా శాఖను ఏమార్చి బొగ్గు రవాణా చేస్తున్నాయని తెలుస్తోంది.  

చర్యలకు శ్రీకారం: జిరాక్స్‌ ఆర్‌సీలలో లారీల నెట్‌వెయిట్‌ను తగ్గించి బొగ్గు రవాణా చేయడాన్ని సింగరేణి యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు హైదరాబాద్, కొత్తగూడెం కార్పొరేట్‌ కార్యాలయం నుంచి శ్రీరాంపూర్‌ జీఎం వివరణ కోరినట్లు సమాచారం. ఎన్నో ఏళ్ల నుంచి సాగుతున్న ఈ దందాను ఇటీవలే గుర్తించి లారీ యజమానులకు నోటీసులు కూడా జారీ చేసిన విషయాన్ని జీఎం ఉన్నతాధికారులకు వివరించారు. కాగా ఆర్‌టీఏ అధికారులు కూడా ఈ అంశంపై సీరియస్‌గా ఉన్నారు. సింగరేణి నుంచి జిరాక్స్‌ ఆర్‌సీలను స్వాధీనం చేసుకొని ఒరిజినల్‌ ఆర్‌సీలను పరిశీలించి కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మంచిర్యాల ఆర్‌టీఏ అధికారులు ఇక్కడ రిజిస్టరైన ట్రక్కుల వివరాలను సేకరించే పనిలో పడ్డారు.

సింగరేణి అధికారుల మీమాంస 
సింగరేణిలో బొగ్గు రవాణా చేసే లారీల యజమానులు ఆర్‌సీలలో నెట్‌వెయిట్‌ మార్చడం అత్యంత సహజమైన ప్రక్రియగా అధికారులు భావిస్తున్నారు. తక్కువ మొత్తానికి కోట్‌ చేసి కాంట్రాక్టు పొందిన లారీ యజమానులు లాభం కోసం కక్కుర్తి పడటం సహజం అనే ధోరణిలో సింగరేణి కార్పొరేట్‌ అధికారులు ఉన్నారు. సింగరేణిలో లారీల నెట్‌వెయిట్‌ను తగ్గించి రవాణా చేస్తున్నప్పటికీ, బొగ్గుతో నిండినప్పుడు గ్రాస్‌వెయిట్‌లో తేడా ఉండదని చెపుతున్నారు. ఆర్‌సీతో పాటు గని వద్ద బొగ్గు లోడ్‌ అయినప్పుడు, సీహెచ్‌పీ వద్ద డంప్‌ అవుతున్నప్పుడు మూడు విధాలుగా బరువును తూచడం జరుగుతుందని, అందులో ఎక్కడ తక్కువగా నమోదైతే దానికే బిల్లులు చెల్లించడం జరుగుతుందని శ్రీరాంపూర్‌ ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఎస్‌డీఎం సుభాని‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. దీనివల్ల సింగరేణి సంస్థకు ఆర్థికంగా ఎలాంటి నష్టం జరగలేదని చెప్పడం గమనార్హం. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top