తెలంగాణ చిన్నమ్మ ఉండుంటే..

Netizens are remembering Sushma Swaraj Services on Prashant Issue - Sakshi

ప్రశాంత్‌ విషయంలో భరోసా కల్పించేవారంటున్న నెటిజన్లు

విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్‌ సేవలను గుర్తుచేసుకుంటున్న వైనం 

దౌత్య అధికారులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ప్రశాంత్‌ తండ్రి

సాక్షి, హైదరాబాద్‌: ప్రియురాలి అన్వేషణలో పొరపాటున భారత సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించిన తెలుగు యువకుడు ప్రశాంత్‌ విషయంలో ఇకపై దౌత్యపరమైన సంప్రదింపులే కీలకం కానున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే భారత ప్రభుత్వానికి సమాచారం ఉందని ప్రశాంత్‌ తండ్రి మాటల ద్వారా తెలిసింది. దీంతో ప్రశాంత్‌ను విడుదల చేసేందుకు విదేశాంగశాఖ పాత్ర కీలకం అవుతుందని పలువురు పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రశాంత్‌ అమాయకుడని, అతని మానసిక పరిస్థితిపై పాకిస్తాన్‌ ముందే అభిప్రాయానికి వచ్చింది కాబట్టే.. అతని ఇంటికి వీడియో సందేశం పంపారని పలువురు భావిస్తున్నారు. కాబట్టి దౌత్య సంప్రదింపులతో ప్రశాంత్‌ ఇండియాకు వస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

చిన్న ట్వీట్‌ చేస్తే చాలు.. 
2014 నుంచి 2019 వరకు విదేశాంగశాఖ మంత్రిగా సేవలందించిన సుష్మా స్వరాజ్‌ భారతీయులను, ముఖ్యంగా విదేశాల్లో సమస్యల్లో చిక్కుకున్న వారిని ఆదుకోవడంలో ముందుండేవారు. చిన్న ట్వీట్‌ చేస్తే గంటల్లో వారి సమస్యలను పరిష్కరించేవారు. ‘భారతీయులు అంగారక గ్రహం మీద ఉన్నా సరే.. వారిని క్షేమంగా తీసుకువస్తాం’అంటూ సుష్మా స్వరాజ్‌ చేసిన ట్వీట్‌ భారతీయుల సంక్షేమంపై ఆమెకు ఉన్న సంకల్పాన్ని చాటిచెప్పింది. పాకిస్తానీయులకు సైతం అత్యవసర వైద్యం కోసం అభ్యర్థించగానే వెంటనే వీసాలు మంజూరు అయ్యేలా చొరవచూపిన అమ్మ మనసు ఆమెది. గతంలో దారితప్పి పాకిస్తాన్‌లో ప్రవేశించిన బధిర బాలిక గీత విషయంలో సుష్మా స్వరాజ్‌ చూపిన చొరవను మాటల్లో అభివర్ణించలేం. తాజాగా ప్రశాంత్‌ విషయంలో నెటిజన్లు సుష్మా స్వరాజ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఆమె ఉండి ఉంటే భరోసా ఇచ్చేవారని అంటున్నారు. తెలంగాణ చిన్నమ్మగా తనను గుర్తుపెట్టుకోవాలన్న సుష్మా స్వరాజ్‌ను మిస్సవుతున్నామంటూ పలువురు పోస్టింగులు పెడుతున్నారు.  

ఢిల్లీ వెళ్లిన ప్రశాంత్‌ తండ్రి బాబూరావు 
కేపీహెచ్‌బీ కాలనీ: ప్రశాంత్‌ను క్షేమంగా రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరేందుకు ప్రశాంత్‌ తండ్రి బాబూరావు, సోదరుడు శ్రీకాంత్‌ బుధవారం ఢిల్లీ వెళ్లారు. ప్రశాంత్‌ను క్షేమంగా మన దేశానికి తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని భారత దౌత్య కార్యాలయ అధికారులను కోరనున్నారు. అయితే ముందస్తు అపాయింట్‌మెంట్‌ లేకపోవడంతో బుధవారం దౌత్య కార్యాలయ అధికారులను బాబూరావు కలవలేకపోయినట్లు తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top