ఖజానాకు గండి

natural stone illegally transported from tandur - Sakshi

రాయల్టీ లేకుండానే నాపరాతి తరలింపు

సరిహద్దులో నిఘా కరువు

దిష్టిబొమ్మలుగా చెక్‌పోస్టులు

పట్టించుకోని యంత్రాంగం

మండిపడుతున్న ప్రజలు

దేశంలోనే ప్రసిద్ధి చెందిన తాండూరు నాపరాతి అక్రమంగా తరలిపోతోంది. నిత్యం వందకు పైగా లారీలు రాయల్టీ లేకుండా.. రాయల్‌గా సరిహద్దులు దాటుతున్నాయి. చెక్‌పోస్టుల వద్ద నిఘా కరువైంది. దీంతో సర్కారీ ఆదాయానికిగండి పడుతోంది. ఈ తంతు చానాళ్లుగా జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.

తాండూరు : తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్‌ మండలాల్లో వేలాది ఎకరాలలో నాపరాతి నిక్షేపాలున్నాయి. తాండూరు మండలంలోని ఓగిపూర్, మల్కాపూర్, కొటబాసుపల్లి, కరన్‌కోట్, సిరిగిరిపేట్‌లో, బషీరాబాద్‌ మండలంలోని ఎక్మాయి, కొర్విచెడ్, నవల్గ, క్యాద్గిరా, జీవన్గిలో ఈ సహజ సంపద విరివిగా లభిస్తోంది. ఆయా గ్రామాల్లోని గనుల నుంచి వెలికితీçస్తున్న నాపరాతిని ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. తాండూరు నుంచి నిత్యం సూమారు 400 లారీల వరకు నాపరాయి రవాణా అవుతోంది. తెలంగాణలోని జిల్లాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఒడిశా, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. అయితే ప్రతీరోజు వందలాది లారీల్లో నాపరాయి రవాణా జరుగుతున్నా కొన్నింటి నుంచి మాత్రమే రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఫీజు అందుతోంది. మిగతా వాహనాలు ఎలాంటి ఫీజులు లేకుండానే యథేచ్ఛగా తరలివెళ్తున్నాయి. రాయల్టీ లేకుండా రవాణా సాగిస్తున్న వ్యాపారులు, ట్రాన్స్‌పోర్ట్‌ నిర్వాహకులు అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు.

ప్రతిరోజు 50 నుంచి 70 లారీల వరకు రాయల్టీ లేకుండా రవాణా..
నాపరాతి తరలింపు పర్యవేక్షణ కోసం భూగర్భ వనరుల శాఖ ఆధ్వర్యంలో తాండూరు మండలం గౌతాపూర్, యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌ సర్కిల్‌ళ్ల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అయితే సంబంధిత సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహించడం లేదు. చెక్‌పోస్టుల నిర్వహణ బాధ్యతలను హోంగార్డులే చూసుకుంటున్నారు. మైనింగ్‌ మాఫియా పెద్దల హస్తంలో ఉండటంతో అందినకాడికి దండుకుని కాలం వెళ్లదీస్తున్నారు.                                                                                                                

ప్రభుత్వ ఖజనాకు గండి..
తాండూరు ప్రాంతంలో ఖనిజ సంపద తరలింపులో భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. నాపరాతి రవాణాతో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాల్సిన అధికారులు మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వ్యాపారులు, ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top