
మిక్సీలు, గ్రైండర్లు ఇంటింటి వస్తువులుగా మారాక విసుర్రాళ్లు దాదాపుగా మూలపడ్డాయి. చాలాచోట్ల విసుర్రాళ్లు పండగ పబ్బాల్లో మాత్రమే వాడుకలోకి వస్తుంటాయి. ఆ తర్వాత ఇళ్లల్లో అలంకారప్రాయంగా మిగులుతుంటాయి. అయితే, తెలంగాణలోని కామారెడ్డి జిల్లా జక్కల్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ప్రజలు నేటికీ విసుర్రాళ్లను వినియోగిస్తున్నారు.
కందులు తదితర పప్పు ధాన్యాలను విసుర్రాళ్లలో విసురుకుని, ఏడాది పొడవునా నిల్వ చేసుకుని వాడుకుంటున్నారు. జక్కల్ నియోజకవర్గంలోని జక్కల్, పెద్దకొడప్‌గల్, బిచ్కుంద, డోంగ్లీ మండలాల్లో దాదాపు తొంభై శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా పప్పు దినుసులను పండిస్తారు.
వర్షాకాలంలో ఈ ప్రాంతంలో దాదాపు అరవైవేల ఎకరాల్లో పప్పుధాన్యాలను సాగు చేస్తారు. పంట చేతికి వచ్చిన తర్వాత పప్పుగింజలను విసుర్రాళ్లలో విసురుకుని, ఏడాది అంతటికీ సరిపోయేలా డబ్బాల్లో నిల్వ చేసుకుంటుంటారు. పప్పు విసురుకునేటప్పుడు శ్రమ తెలియకుండా శ్రావ్యంగా జానపద గీతాలను పాడుకుంటూ ఉంటారు.
మిల్లులు అందుబాటులోకి వచ్చినా, ఇలా విసుర్రాళ్లపైనే ఆధారపడుతున్నారు ఎందుకని ప్రశ్నిస్తే, ‘మార్కెట్‌లో అమ్మే పప్పు పాలిష్ చేసి ఉంటది. రుచి అంతగా ఉండదు. ఇసురుకున్న పప్పు రుచి చాలా బాగుంటది’ అంటుంది మర్నూర్ గ్రామానికి చెందిన ఉత్తుర్‌వార్ అనిత.
స్.వేణుగోపాలాచారి, సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
(చదవండి: Lukla Airport: అత్యంత ప్రమాదకరమైన ఎయిర్‌పోర్ట్..! ఇక్కడ ల్యాండింగ్, టేకాఫ్..)