వసూళ్ల ఆగలే

Nalgonda Police Collection Of Donations - Sakshi

జిల్లాలో కొందరు పోలీసు అధికారులు మళ్లీ వసూళ్ల పర్వానికి తెర లేపారా..? ఖాకీల హెచ్చరికలకు భయపడి నిర్వాహకులే నేరుగా స్టేషన్‌లో ఇచ్చి వెళ్తున్నారా.. జిల్లా పోలీస్‌ బాస్‌ భయానికి ఎలాగోలా ఆరు నెలలపాటు వసూళ్లు ఆపిన వీరు.. ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టుకుంటున్నారా అంటే ఆ శాఖలోని పరిణామాలు చూస్తుంటే.. అవుననే సమాధానం వస్తోంది. 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో వైన్‌షాపుల నుంచి పోలీసుల వసూళ్ల దందా జోరందుకున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఏవీ రంగనాథ్‌ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వైన్‌షాపుల నుంచి జరుగుతున్న అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేశారు. ఆయన చేసిన హెచ్చరికలతో.. దాదాపు 6 నెలల పాటు మద్యం దుకాణాలనుంచి ఎలాంటి వసూళ్లూ చేయలేదు. గతంలో ప్రతి పోలీస్‌స్టేషన్‌  నుంచి వసూళ్ల కోసం ప్రత్యేకంగా హోంగార్డు, కానిస్టేబుల్‌ స్థాయి వ్యక్తిని నియమించి నెలవారీగా కొంత జేబులో వేసుకునేవారు. విషయం పసిగట్టిన ఎస్పీ రంగనాథ్‌ అక్రమ వసూళ్లకు చెక్‌ పెట్టడంతో కొందరు పోలీస్‌ అధికారులు లూప్‌లైన్‌లోకి కూడా వెళ్లిపోయారు. మరికొందరు అధికారులు వేచి చూసే ధోరణి అవలంబించారు. కింది స్థాయి అధికారులతో వసూళ్లు చేయించడంతో భాగస్వామ్యం ఉన్న పోలీసులను బదిలీ చేసి అక్రమాలకు పాల్పడకుండా కట్టడి చేశారు.

కొన్నాళ్లుగా తిరిగి వసూళ్లు మొదలైనట్లు సమాచారం అందింది. వైన్‌షాపు నిర్వహకులే నేరుగా స్టేషన్‌లో ఇచ్చివెళ్లే విధంగా ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది. మరికొందరు రహస్యంగా వ్యక్తులను పెట్టుకొని వైన్స్‌లనుంచి మళ్లీ వసూలు చేస్తున్నారు. వసూలు చేయకుండా నిలిచిపోయిన ఆరు నెలల డబ్బులను కూడా తిరిగి రికవరీ చేసుకున్నారని సమాచారం. జిల్లాలో 138 వైన్‌షాపులు, 16 బార్లు ఉన్నాయి. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ వంటి పట్టణాల్లో బార్లు, మద్యంషాపుల నుంచి నెలకు రూ.13వేల నుంచి రూ.15 వేల వరకు, మండల కేంద్రాల్లో రూ. 10వేల నుంచి రూ. 12వేల వరకు నెలవారీ వసూలు చేస్తున్నారని అంటున్నారు. ప్రతినెలా పోలీసులకు రూ.15 లక్షల నుంచి 18లక్షల వరకు మామూళ్లు వెళ్తున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు అక్రమంగా నిర్వహించే ఇతర దందాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. వైన్‌షాపు నిర్వహకులు డబ్బులు ఇవ్వకపోతే సమయం దాటిపోయిందని, రోడ్డుపై వాహనాలు నిలిచాయని అభ్యంతరం చెబుతారని, తమ వ్యాపారం నడవదన్న భయంతో నెలవారీ వసూళ్లు అందజేస్తున్నారని పేర్కొంటున్నారు.

నాకింత... నీకింత...
పోలీసులు వసూలు చేసిన డబ్బులు నాకింత... నీకింత అని ఒక స్థాయి అధికారులు పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. వైన్‌షాపుల నుంచి నెలవారీగా వసూలు చేస్తున్న డబ్బుల్లో మూడు స్థాయిల్లో ఉండే అధికారులు పంచుకుంటున్నట్లు పోలీస్‌శాఖలోనే చర్చ జరుగుతోంది. స్టేషన్‌ ఖర్చులు అంటూ వైన్‌షాపుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ప్రతి స్టేష న్‌కు ప్రభుత్వం రూ.50వేల నుంచి రూ.73వేల వరకు నెలవారీ ఖర్చుల కింద అందజేస్తుంది.

ఎక్సైజ్‌ శాఖదీ వసూళ్లదారే...
జిల్లాలో ఎక్సైజ్‌శాఖ అధికారులు కూడా వైన్‌షాపులు, బార్ల నుంచి నెలవారీ వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. పోలీసులకు ఎంతిస్తే తమకూ అంతే ఇవ్వాలంటూ కొర్రీలు పెట్టడంతో రూ.2వేల తేడాతో ఎక్సైజ్‌ శాఖ అధికారులు నెలవారీ వసూళ్లు చేస్తున్నారని తెలిసింది. పట్టణాల్లో రూ.13,500 పోలీసులకు ఇస్తే ఎక్సైజ్‌ వాళ్లు రూ.12,500 వసూలు చేస్తున్నట్లు వైన్‌షాప్‌ నిర్వహకులు చెబుతున్నారు. బార్ల నుంచి కూడా నెలవారీ మామూళ్లు నడుస్తున్నాయి. ఎక్సైజ్‌ శాఖకు నెలకు రూ. 15 లక్షల నుంచి 18 లక్షలు మామూళ్ల రూపంలో వెళ్తున్నాయి. ఎక్సైజ్‌ టెండర్‌లో షాప్‌లు దక్కించుకున్న వ్యాపారుల నుంచి ఒక్క దుకాణానికి రూ. లక్ష చొప్పున గుడ్‌విల్‌ తీసుకుని రికార్డుల ప్రక్రియ పూర్తి చేశారని, నెలవారీ వసూళ్లతోపాటు టెండర్‌లో వైన్‌షాప్‌ దక్కిన వ్యాపారి రూ.లక్ష చొప్పున ఎక్సైజ్‌ అధికారులకు అప్పగించినట్లు ప్రచారం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top