కరోనా: పంచ సూత్రాలు పాటించాల్సిందే

Municipal Commissioner Of Nizamabad Made Some Suggestions Control Of Corona - Sakshi

కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలి

కార్పొరేషన్‌ కమిషనర్‌ పాటిల్‌

సాక్షి, నిజామాబాద్‌ : రోజురోజుకు విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. అందుకుగాను ఆదివారం నుంచి నగరంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలు కరోనా నివారణకు పంచసూత్రాలను పాటించాలని స్పష్టం చేశారు. ఆయన శనివారం తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ పంచా సూత్రలను వివరించారు.

1. పిల్లలు, పెద్దలందరూ కుటుంబ సభ్యులతో కలసి ఇంట్లోనే ఉండాలి. 2. పిల్లలను మార్కెట్‌కు తీసుకుని రావొద్దు. 3. ఇంట్లో నుంచి బయటకు వెళితే తప్పకుండా మాస్క్‌లు ధరించాలి. ప్రీ ప్లేయర్, సర్జికల్‌ మాస్క్‌లు వాడాలి. భౌతిక దూరం పాటించాలి. 4. బయట నుంచి ఇంట్లోకి వెళ్లగానే సబ్బుతో తప్పకుండా మోచేతి వరకు చేతులు శుభ్రం చేసుకోవాలి. 5. ఎవరికైనా జ్వరం, దగ్గు ఉంటే వెంటనే సమాచారం అందించాలి. అని వివరించిన మున్సిపల్‌ కమిషనర్‌ ఆదివారం నుంచి సూపర్‌మార్కెట్‌లు, రిలయన్స్‌ మార్ట్, జనరల్‌ స్టోర్స్, కిరాణా షాపులు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే అమ్మకాలు జరపాలని, ఆ తర్వాత బంద్‌ పాటించాలని స్పష్టం చేశారు. ఒక్క మెడికల్‌ షాపులు మాత్రం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.  

హాట్‌స్పాట్‌ జోన్లలో.. 
నగరంలో ప్రకటించిన కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌ (హాట్‌స్పాట్‌) ఏరియాల్లో బారికేడ్లు కట్టి ఆ ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేసేందుకు వాలంటీర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

డ్రోన్‌లతో స్ప్రే.. 
కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు, ప్రధాన కూడళ్లు తదితర ప్రాంతాల్లో డ్రోన్‌ల ద్వారా స్ప్రే చేయిస్తామని కమిషనర్‌ తెలిపారు. ఢిల్లీ మర్కజ్‌ నుంచి వచ్చిన వారి రక్త నమునాలను సేకరించి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి పంపుతున్నట్లు తెలిపారు. నిజామాబాద్‌ నగరంలో ఎలాంటి పరీక్షలు నిర్వహించడం లేదన్నారు. నగరంలోని ప్రజలకు తక్కువ ధరలకు కూరగాయలు అందించేందుకు ప్రత్యేకంగా శివాజీనగర్‌లోని ఐటీఐ ఆవరణలో కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయన్నారు. సంచార కూరగాయల విక్రయాలు కూడా జరుపుతున్నట్లు తెలిపారు. ప్రజలు సహకరిస్తే కరోనా నియంత్రించవచ్చని ఆయన కోరారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top