సొంత గూటికి మున్సిపల్ చైర్‌పర్సన్! | Municipal Chairperson bogula Vijaya Lakshmi | Sakshi
Sakshi News home page

సొంత గూటికి మున్సిపల్ చైర్‌పర్సన్!

Apr 9 2016 3:38 AM | Updated on Apr 3 2019 5:51 PM

సొంత గూటికి మున్సిపల్ చైర్‌పర్సన్! - Sakshi

సొంత గూటికి మున్సిపల్ చైర్‌పర్సన్!

సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ బొంగుల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు.

సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ బొంగుల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. పదకొండేళ్ల తరువాత ఆమె తిరిగి సొంతగూటికి చేరుకోనున్నారు. శనివారం ఆమె హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. మొదట్లో ఆమె టీఆర్‌ఎస్ తరఫున మున్సిపల్ కౌన్సిలర్‌గా గెలుపొంది చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత జరిగిన పరిణామ క్రమంలో టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఈమె భర్త బొంగుల రవి మాజీ ఎమ్మెల్యే టి.జయప్రకాశ్‌రెడ్డికి ప్రధాన అనుచరుడు. జయప్రకాశ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరగా చైర్‌పర్సన్‌తోపాటు ఆమె భర్త సైతం ఆయన వెంటే నడిచారు.

కాంగ్రెస్ తరఫున గెలుపొంది చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయినా అభివృద్ధి పనులు జరగడం లేదనే ఆలోచనతో టీఆర్‌ఎస్‌లో చేరేందు కు నిర్ణయించుకున్నట్టు తెలిసింది.  
 
పట్నం బాటలోనే బొంగుల...
ఇదే సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఉన్న పట్నం విజయలక్ష్మి కాంగ్రెస్ తరఫున గెలుపొందినప్పటికీ ఆ తరువాత ఆమె ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మద్దతుతో టీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా సంగారెడ్డి చైర్‌పర్సన్ బొంగుల విజయలక్ష్మి సైతం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపాలిటీలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నా.. మంత్రులు, అధికారులు పట్టించుకోవడం లేదని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. నాలుగేళ్లుగా ఇన్‌చార్జి కమిషనర్లతోనే కాలం వెల్లదీస్తున్నారు.

మున్సిపల్ చైర్‌పర్సన్‌తోపాటు పాలకవర్గ సభ్యులు పలుమార్లు ఉన్నతాధికారులతో మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే టీఆర్‌ఎస్‌లో చేరడమే మంచిదనే ఆలోచనతోనే కాంగ్రెస్‌ను వీడి అధికార పార్టీలో చేరుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ పరిణామంతో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డికి షాక్ ఇచ్చినట్టేనని పలువురు పేర్కొంటున్నారు.
 
సీఎం సమక్షంలో...
శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో చైర్‌పర్సన్ బొంగుల విజయలక్ష్మి సీఎం సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement