
టీడీపీకి మరో షాక్?
ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ టీడీపీకి మరో షాక్ తగల నుంది. టీటీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ టీడీపీకి మరో షాక్ తగల నుంది. టీటీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. వరంగల్ (ఎస్సీ) లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న తరుణంలో ఆయన పార్టీకి గుడ్‌బై చెబుతున్నారని, గులాబీ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 20 రోజులుగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలను బట్టి మోత్కుపల్లితోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూడా పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మోత్కుపల్లి ఖమ్మం జిల్లా మధిర స్థానం నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు.
ఆ తర్వాత ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తారని, ఈశాన్య రాష్ట్రాలకు గవర్నర్‌గా పంపిస్తారని ప్రచారం జరిగినా అతీగతీ లేదు. తనను పట్టిం చుకోవడం లేదన్న అసంతృప్తితో ఉన్న మోత్కుపల్లి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని, వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయాలని ఆశపడుతున్నారని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ ఈసారి కూడా బరిలోకి దిగనుందని తెలియడంతో తనకు పోటీ చే సే అవకాశం రాదని మోత్కుపల్లి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్ ఎంపీ స్థానానికి టికెట్ ఆశిస్తూ తనకు అవకాశం ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధమని టీఆర్‌ఎస్ నాయకత్వానికి మోత్కుపల్లి సమాచారం పంపించారని తెలుస్తోంది.