ప్రజాధనం వృథా చేయొద్దు

MLA Padma Devender Reddy Unhappy Over Development Works And Asked Not To Waste Public Money - Sakshi

రైల్వేలైన్‌ పనుల నిర్మాణంపై ఎమ్మెల్యే ఆగ్రహం

దెబ్బతిన్న ప్లాట్‌ఫాంను మళ్లీ నిర్మించండి

ఆ ఖర్చు కాంట్రాక్టర్‌ భరించాల్సిందే    

సాక్షి, మెదక్‌: ప్రభుత్వ సొమ్మును నాశనం చేస్తున్నారు. నాణ్యత లోపం పనుల్లో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అక్కన్నపేట–మెదక్‌ రైల్వేలైన్‌ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. రూ.200 కోట్లతో జరుగుతున్న రైల్వేలైన్‌ పనులు వేగవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

రైల్వేస్టేషన్‌ వద్ద నిర్మిస్తున్న ప్లాట్‌ఫాం నాణ్యతా లోపంతో నిర్మించడంతో పూర్తిగా కుంగిపోయింది. ఫ్లాట్‌ఫాం రెండు ముక్కలుగా పగిలిపోవడాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులపై మండిపడ్డారు. ఇంత దారుణంగా నిర్మాణం జరుగుతున్నా అధికారుల కంటికి కనిపించడం లేదా? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా పనులు జరుగుతుంటే అధికారులకు కనిపించడం లేదా? ఏం చేస్తున్నరంటూ మండిపడ్డారు. అరకిలో మీటర్‌ మేర వేసిన ప్లాట్‌ఫాం పూర్తిగా దెబ్బతిన్నదని, దాన్ని పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన ఖర్చు కాంట్రాక్టరే భరించాలన్నారు.

ఈ విషయంపై రైల్వే ఇంజనీర్‌ ప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ నాణ్యతలేని పనులు జరుగుతుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. అదే విధంగా రైల్వేస్టేషన్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి లోపల అన్ని పగుళ్లు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం ఇప్పుడే పగుళ్లుంటే ఎన్నిరోజులుంటుందని మండిపడ్డారు. ప్రజల సొమ్ము ప్రజలకు చెందాలన్నారు. మంగళవారం ఎంపీ ఆధ్వర్యంలో రైల్వే అధికారులతో రివ్యూ నిర్వహిస్తానని, అధికారులంతా హాజరు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీవైస్‌చైర్మన్‌ లావణ్యరెడ్డి, ఆర్డీఓ సాయిరాం, తహసీల్దార్‌ రవికుమార్,  ఎంపీపీ యమున, మాజీ కౌన్సిలర్లు మాయ మల్లేశం, ఆర్కెశ్రీనివాస్, నాయకులు లింగారెడ్డి, కృష్ణ, తొడుపునూరి శివరామకృష్ణ, గూడూరి అరవింద్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  

 
కాంట్రాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top