పుప్పాలగూడలో హెడ్‌ కానిస్టేబుల్‌ ‘భూ కబ్జా’

Miyapur Head Constable Land Grabbing And Threats to Flat Owners - Sakshi

ఫిర్యాదుదారులపైనే మళ్లీ తిరిగి అదే కేసు నమోదుచేసిన వైనం

పోలీసుల అండ చూసుకొని రెచ్చిపోతున్న మియాపూర్‌

ఆర్టీసీ విజిలెన్స్‌ ఉద్యోగి అక్రమ మార్గాలతో

ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించాడనే ఆరోపణలు  

సాక్షి, సిటీబ్యూరో: మియాపూర్‌ ఆర్టీసీ విజిలెన్స్‌ విభాగంలో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ సూరం ఇంద్రారెడ్డి కొంతమంది పోలీసుల అండ చూసుకొని రెచ్చిపోతున్నాడు. పుప్పాలగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌ 88,89,94 ప్లాట్‌ నంబర్‌ 929లోని 300 గజాల స్థలంలోని కొంత భూమిని అక్రమించి ప్రహరీ నిర్మించడమే కాకుండా తిరిగి వారిపైనే ట్రెస్‌పాస్‌ కింద నార్సింగ్‌ ఠాణాలో కేసు నమోదు చేయించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అంతకుముందే సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ ఆదేశాల ప్రకారం నార్సింగ్‌ ఠాణా పోలీసులు హెడ్‌కానిస్టేబుల్‌ సూరం ఇంద్రారెడ్డిపై భూకబ్జా కేసు నమోదుచేసి రెండు రోజులు గడవకముందే తిరిగి వారిపైనే అదే ట్రెస్‌పాస్‌ కింద కేసు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది. 

వీరు సీపీని ఆశ్రయించారు...అతడు మేనేజ్‌ చేశాడు...
అమీర్‌పేటలో నివాసముంటున్న అచ్యుతవల్లి పుప్పలగూడలో సర్వే నంబర్‌ 88,89,94 ప్లాట్‌ నంబర్‌ 929లోని 300 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇల్లు కట్టుకునేందుకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ నుంచి బిల్డింగ్‌ పర్మిషన్‌ తెచ్చుకున్నారు. అయితే ఈ పనులు ప్రారంభిద్దామని ఆ ప్లాట్‌కు వెళ్లేసరికి కొలతలు చేయగా అచ్యుతవల్లిలోని కొంత భూమిని పక్కనే ప్లాట్‌ యజమాని సూరం ఇంద్రారెడ్డి ఆక్రమించి ప్రహరీ నిర్మించాడని తేలింది. అయితే పుప్పాలగూడ కేపీఆర్‌ కాలనీ ప్లాట్‌ నంబర్‌ 54, 55లో ఉంటున్న హెడ్‌కానిస్టేబుల్‌ ఇంద్రారెడ్డి ఇంటికి వెళ్లి అచ్యుతవల్లి బంధువులు మాట్లాడితే ఆ అక్రమం వాస్తవమేనని, అయితే పాత యజమానికి తాను రూ.రెండు లక్షల అదనంగా అప్పగించనట్టు, ఆ డబ్బులిస్తేనే ప్రహరీ తీసేస్తానంటూ సమాధానం చెప్పడంతో అచ్యుతవల్లి కుటుంబసభ్యులు ఖంగుతిన్నారు. వెంటనే నార్సింగ్‌ ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు వెళితే ఇదీ సివిల్‌ మ్యాటర్‌ అంటూ పిటిషన్‌ ఐడీ 140319/00665 ఇచ్చి పక్కనబెట్టారు. దీంతో బాధితులు సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ను కలిసి వివరించడంతో ఇది అక్రమ కబ్జా కిందకే వస్తుందంటూ నార్సింగ్‌ ఠాణా ఎస్‌హెచ్‌వోకు ఆదేశాలు జారీ చేశారు.

దీంతో మార్చి 28న ఐపీసీ 447, 427 సెక్షన్ల కింద నార్సింగ్‌ పోలీసుల కేసు నమోదు చేశారు. ఆ ప్లాట్‌ వద్దకు వెళ్లి సంబంధిత ఎస్‌ఐ చుట్టుపక్కల వారితో మాట్లాడి ఆ ప్లాట్‌ కొలతలు తీసుకుని సాక్షుల సంతకాలు కూడా తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన సూరం ఇంద్రారెడ్డి తనకున్న పరిచయాలను ఉపయోగించి అదే పోలీసు స్టేషన్‌లో అచ్యుతవల్లి భర్త లక్ష్మీనారాయణపైనే ట్రెస్‌పాస్‌ కింద తప్పుడు కేసు నమోదు చేయించారు. లక్ష్మీనారాయణ తన ప్లాట్‌లో మట్టిపోసుకుంటే తమ ప్లాట్‌లోకి వచ్చి చేరి బోరు మూతపడిందని సూరం ఇంద్రారెడ్డి ఫిర్యాదు చేయగానే పోలీసులు కేసు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉందనే విమర్శలు కూడా వస్తున్నాయి. కనీసం లక్ష్మీనారాయణను పిలిపించి మాట్లాడకుండానే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడంలో ఉద్దేశమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇదిలాఉండగా ఇంద్రారెడ్డి పనిచేసే మియాపూర్‌ ఆర్టీసీ విజిలెన్స్‌ విభాగంలోనూఅతని అవినీతి తీవ్రస్థాయిలో ఉందని, లెక్కకు మించి ఆస్తులు కూడబెట్టాడనే ఆరోపణలు వినవస్తున్నాయి.  

ఆ ప్లాట్‌ ఆది నుంచీ వివాదాస్పదమే..
ఇంకో విషయం ఏమిటంటే కొంత భూమి కబ్జా చేసి గోడకట్టిన ఇంద్రారెడ్డి ప్లాట్‌లో ఉన్న ఓ పరిశ్రమలో కొన్ని నెలల క్రితం జరిగిన అగ్నిప్రమాదంతో ఏకంగా పక్కనే ఉన్న బాబానివాస్‌ అపార్ట్‌మెంట్‌లోకి మంటలు చొరబడ్డాయి. దీంతో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. అనేక మంది గాయపడ్డారు. కొంతకాలం పాటు ఖాళీగానే ఉంచిన ఈ ప్లాట్‌లో ఇప్పుడూ వెల్డింగ్‌ షాప్‌ కోసం ఏర్పాట్లు చేస్తుండటంతో ఆ అపార్ట్‌మెంట్‌ వాసులు వద్దని వారిస్తున్నా స్థానిక పోలీసుల అండతో ముందుకెళుతున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. రెసిడెన్సీ ప్రాంతంలో మళ్లీ వెల్డింగ్‌ పరిశ్రమ నెలకొల్పుతుండటంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ వస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top