మిషన్‌ భగీరథ  దేశానికే ఆదర్శం

Mission Bhagiratha Scheme Is Best Scheme Mahender Reddy Rangareddy - Sakshi

పరిగి: మిషన్‌ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని జాపర్‌పల్లిలో నిర్మించిన మెయిన్‌ గ్రిడ్‌ ట్రయల్‌ రన్‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. అంతకుముందు గ్రామంలోని అంబేడ్కర్, జ్యోతిరావుపూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జాపర్‌పల్లి నుంచి తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాల ప్రజలకు తాగునీటిని అందించేందుకు రూ,1,100 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులు చురుగ్గా సాగుతున్నాయని ఆనందం వ్యక్తంచేశారు.

త్వరలోనే ఇంటింటికీ తాగునీరు సరఫరా అవుతుందని స్పష్టంచేశారు. మహిళల కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అన్నివర్గాల ప్రజలకు మేలు జరిగేలా అనేక పథకాలు అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తిరుగులేదని తెలిపారు. ఆయనతో పాటు రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కొప్పుల మహేశ్‌రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.

మానవ హక్కుల సంఘం కృషి అభినందనీయం...
తాండూరు: హక్కుల పరిరక్షణకు.. మానవ హక్కుల సంఘాలు చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తాండూరులోని సమద్‌ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం ఆల్‌ ఇండియా హ్యూమన్‌ రైట్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఫోరం ద్వితీయ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ హక్కుల సంఘం ఏర్పాటుచేసి ప్రజలకు సేవ చేయడం గొప్ప విషయమన్నారు. పౌర హక్కులకు భంగం కలిగితే మానవ హక్కుల సంఘాలు కాపాడతాయన్నారు.

ప్రజలు సేవాభావాలను అలవర్చుకోవాలని సూచించారు. రాష్ట్ర అంతర్జాతీయ పీస్‌ అంబాసిడర్‌ ఎం.ఎ.నజీబ్‌ మాట్లాడుతూ.. దేశంలో కులమతాలకతీతంగా మెలిగినప్పుడే శాంతి స్థాపన సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సునీత, అసోషియేషన్‌ చైర్మన్‌ ఎం.ఎ.ముజీబ్‌ పటేల్, హైకోర్టు న్యాయవాది కదర్‌ఉన్నీసా, వెల్ఫేర్‌ అసోషియేషన్‌ జిల్లా అధ్యక్షుడు గులాం ముస్తఫా పటేల్, తాండూరు మున్సిపల్‌ కౌన్సిలర్‌ జుబేర్‌లాల, టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్‌ రవూఫ్, మాజీ కౌన్సిలర్‌ ముక్తర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top