
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత పరిశుభ్రతతోనే వ్యాధులు దరిచేరవని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు శుభ్రతను పాటించాలన్న మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బంజారాహిల్స్‌లోని తన ఇంటి పరిసరాలను మహమూద్ అలీ శుభ్రంచేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఓవైపు కరోనా విజృంభణ, మరోవైపు సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్న క్రమంలో అందరూ వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. బయటికి వెళ్లేవారు తప్పకుండా మాస్కు, శానిటైజర్ వెంట తీసుకెళ్లాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు.