మెట్రో రైలుపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

 Minister Ktr Review on Metro Rail - Sakshi

హైదరాబాద్‌ : మెట్రో రైలు కార్యకలాపాలపై  తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు మంగళవారం సమీక్షించారు. బేగం పేట మెట్రోరైల్ భవన్లో ఈ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మెట్రో పనితీరును మంత్రి అడిగి తెలుసుకున్నారు. మెట్రో రైళ్ల ఫ్రీక్వేన్సీని పెంచేందుకు ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఫ్రీక్వెన్సీతోపాటు రైళ్ల వేగం పెంచడం వల్ల ప్రస్తుతం ఉన్న ప్రయాణ సమయం మరింత తగ్గుతుందని మెట్రోరైల్ ఎండీ ఎన్వీయస్ రెడ్డి మంత్రికి తెలిపారు. ఇతర మెట్రోలతో పొల్చితే హైదరాబాద్ మెట్రోలో ప్రయాణీకుల సంఖ్య బాగుందన్నారు.

చెన్నైలాంటి నగరాల్లో రెండు సంవత్సరాల్లో ప్రయాణించిన సంఖ్యతో పొల్చితే నగర మెట్రోలో ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగానే ఉందని మెట్రో అధికారులు తెలిపారు. ప్రారంభం నాటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి సమస్యలు లేకుండా మెట్రో కార్యకలాపాలు నడుస్తున్నాయన్నారు. మెట్రో టికెటింగ్‌లో మరిన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సెట్విన్‌ వంటి సంస్ధల ఆధ్వర్యంలో నూతనంగా వంద ఎలక్ర్టిక్ బస్సులను ఏర్పాటు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను తెలపాలన్నారు.

మెట్రో కారిడార్లో పార్కింగ్, ఫుట్ పాత్, రోడ్ల వంటి మౌళిక వసతుల కల్పన మరింత వేగంగా జరగాలన్నారు. పార్కింగ్ సదుపాయాన్ని మరింత పెంచడం కోసం 12 మల్టీ లెవల్ పార్కింగ్(ఎంఎల్‌పీ) సదుపాయాలకు టెండర్లు పిలవనున్నట్లు మంత్రికి మెట్రో అధికారులు తెలిపారు. నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద ఈ-ఎంఎల్‌పీ సదుపాయానికి వారం పది రోజుల్లో టెండర్లు పూర్తి కానున్నట్లు తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా షి టాయ్‌లెట్ల  నిర్మాణం చేయాలని మంత్రి ఆదేశించారు. మెట్రోలో మిగినలిన కారిడార్ల నిర్మాణం త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని, ఆయా కారిడార్ల పనుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు.

అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు పనులు వేగంగా నడుస్తున్నాయని అధికారులు మంత్రికి తెలిపారు. మెట్రో రెండో దశ ప్రణాళికలపైన ఈ సందర్భంగా మంత్రి చర్చించారు. కారిడార్ల ఎంపిక, స్టేషన్ల గుర్తింపు, నిధుల సేకరణ వంటి అంశాలపైన ఒక నివేదిక సిద్దం చేయాలని, త్వరలోనే ముఖ్యమంత్రి ఈ అంశంపైన సమీక్షించే అవకాశం ఉన్నదని అధికారులకు తెలిపారు. ఎయిర్ పోర్ట్ ఎక్స్ మెట్రో ( మెట్రోరైలు) ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి అదేశించారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్ పొర్ట్కు కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు తయారు చేయాలని మెట్రో అధికారులను కోరారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్‌తో పాటు, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top