భూ వివాదాలు కొలిక్కి తెస్తాం

Minister KTR on LB nagar Revenue Issues - Sakshi

  ఎల్బీనగర్‌ రెవెన్యూ వివాదాలపై సమీక్షలో మంత్రి కేటీఆర్‌ 

  58, 59 జీవోల కింద మరోసారి దరఖాస్తుకు అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని భూ వివాదాలను కొలిక్కి తెస్తామని ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. అసైన్డ్, వక్ఫ్, ఎండోమెంట్, ఎఫ్‌టీఎల్‌లకు సంబంధించిన భూ వివాదాల్లో పాలనాపర అంశాలను 15 రోజుల్లో పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. 58, 59 జీవోల కింద గతంలో దరఖాస్తు చేసుకోని వారికి మరో సారి అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గ పరిధిలోని రెవెన్యూ సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు, కాలనీల ప్రజలతో సోమవారం ఎల్బీనగర్‌ జీహెచ్‌ఎంసీ జోనల్‌ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ చర్చించారు. దాదాపు 20 కాలనీలు, బస్తీల భూముల వివాదాలను క్షుణ్నంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్డీవో స్థాయిలో రికార్డుల సవరణ చేయకపోవడంతో కొన్ని సమస్యలు తలెత్తాయని, ఆ రికార్డులను వెంటనే సవరించాలని ఆదేశించారు. చట్టాలను సవరించాల్సి వస్తే సంబంధిత తీర్మానాలను వచ్చే కేబినెట్‌ భేటీలో చర్చించి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చట్ట సవరణ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. వక్ఫ్‌ భూముల వివాదాలపై రెవెన్యూ మంత్రి మహమూద్‌ అలీ నేతృత్వంలో త్వరలోనే సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధులకు కేటాయించిన భూముల విక్రయాలకు సంబంధించి పదేళ్లకు పైగా ఉన్న నిర్మాణాలు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ఎన్‌వోసీల జారీకి చర్యలు చేపడతామన్నారు. చెరువుల ఎఫ్‌టీఎల్‌ పరిధి, కన్జర్వేషన్‌ జోన్లలో ఉన్న నిర్మాణాలపై జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. 

దాదాపు 4 గంటల పాటు.. 
మన్సూరాబాద్‌ సర్వే నంబర్‌ 44, 45లలోని నిర్మాణాలను 2007 రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం క్రమబద్ధీకరించాలని ఆయా కాలనీల వాసులు కోరగా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నాగోల్‌ సాయినగరంలోని 101, 102 సర్వేలలో ఉన్న 1,952 ఇళ్ల వివరాలను రికార్డుల్లో తప్పుగా పేర్కొన్నారని, 15 రోజుల్లోగా వాటిని సవరించాలని రంగారెడ్డి ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎన్‌.వి.రెడ్డిని ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు ఎఫ్‌టీఎల్‌ కన్జర్వేషన్‌ జోన్ల జోలికి వెళ్లమన్నారు.

గ్రీన్‌ పార్కు కాలనీ సమీపంలో ఖాళీగా ఉన్న 3,200 గజాల స్థలంలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలని కార్పొరేటర్‌ ఎం.శ్రీనివాసరావు కోరగా.. ఆ భూమి విషయంలో వివాదం లేకపోతే కాంప్లెక్స్‌ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జోనల్‌ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ మంత్రి మహమూద్‌ అలీ, మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఆర్‌.కృష్ణయ్య, తీగల కృష్ణారెడ్డి, సీసీఎల్‌ఏ రాజేశ్వర్‌ తివారీ, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్‌ ఎన్‌.వి.రెడ్డి పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top