రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి 

Minister Indrakaran Reddy Development Works In Adilabad - Sakshi

ఖానాపూర్‌:  ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తుందని గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. పెంబి మండలం మందపల్లి పంచాయతీ పరిధి నాగాపూర్‌ గ్రామంలో నాల్గో విడత మిషన్‌ కాకతీయ పథకం కింద రూ.2.50 కోట్లతో మంజూరైన రాగిచెరువు పనులను ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మిషన్‌ కాకతీయ పథకానికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.4వేలు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు. మందపల్లి గ్రామంలోని పల్కేరు వాగు ఎత్తు పెంచడానికి అధికారులు సర్వే చేస్తున్నారన్నారు.

సరస్వతి కాలువ, ఉప కాలువలతో పాటు సదర్‌మాట్‌ బ్యారేజీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. కోర్టు ఆదేశాలతో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి సహకారంతో నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. రాగి చెరువు నిధుల మంజూరుకి కృషి చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకముందు గ్రామస్తులు మంత్రి, ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా చైర్మన్‌ వెంకట్‌రామ్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నల్ల శ్రీనివాస్, పెంబి టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, ఎంపీటీసీ పోతురాజుల లచ్చవ్వ, ఎఫ్‌సీఎస్‌ చైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాంచందర్, నాయకులు గోవింద్, శేఖర్‌గౌడ్, లక్ష్మీనారాయణ, రాజవ్వ, ఈఈ రమేశ్, డీఈ శరత్‌బాబు, ఏఈఈ శ్రీనివాస్‌ తదితరులున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top