కృష్ణమ్మ నీటితో రైతన్న కాళ్లు తడుపుతాం

Minister Harish Rao comments on Krishna water and Farmers - Sakshi

నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

అమ్రాబాద్‌/అచ్చంపేట రూరల్‌: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాల మాగాణికి సాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. కృష్ణమ్మ నీటితో రైతన్న కాళ్లు తడుపుతామని చెప్పారు. సోమ వారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలో ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్‌తో కలసి ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్రాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ వారు తెలంగాణే వద్దన్నారు. కాంగ్రెస్‌ నాయకులు లోన ఒకటి, పైన మరొకటి మాట్లాడారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పాలనలో అన్ని రంగాల్లో వెనకబడిన తెలంగాణలో ముఖ్యంగా కరెంట్‌ కోతలవల్ల రైతులు, ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేల కోట్లు వెచ్చించి 24 గంటల కరెంటును సరఫరా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. అమ్రాబాద్, పదర మండలాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.  కల్వకుర్తి నీళ్లు చంద్రసాగర్‌కు వచ్చేలా చూడాలని ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్‌ కోరడంతో, వ్యాప్‌కోస్‌ సంస్థ ద్వారా రూ.800 కోట్ల వ్యయంతో సర్వే చేయిస్తున్నామని మంత్రి చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్‌ నేతలు ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుపడుతున్నారని విమర్శించారు. అచ్చంపేట నియోజకవర్గంలో డిండి ఎత్తిపోతల, కేఎల్‌ఐ ద్వారా 1.55 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని వివరించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top