గ్రేటర్‌ సిటీపై 'వలస' కూలీల ఎఫెక్ట్‌ | Migrant Workers Journey Effect on Small Industries in Hyderabad | Sakshi
Sakshi News home page

సిటీపై ఎఫెక్ట్‌

May 15 2020 7:53 AM | Updated on May 15 2020 7:53 AM

Migrant Workers Journey Effect on Small Industries in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ నగరం నుంచి వలసకూలీలు ఇంటి బాటపట్టడంతో పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. స్వరాష్ట్రంలో ఉపాధి కరువై..బతుకు బరువై భాగ్యనగరానికి పొట్టచేతబట్టుకొని వలసవచ్చి న కూలీలు ఇప్పుడు ప్రత్యేక రైళ్లలో సొంతరాష్ట్రాలకు తరలి వెళుతున్నారు. లక్షలాదిమందిని ఆదరించి అక్కున చేర్చుకొని ఉపాధి కల్పించిన నగరంలో కరోనా మహమ్మారి విసిరిన పంజాకు పలు రంగాలు కుదేలవుతున్నాయి. లాక్‌డౌన్‌ దెబ్బకు నిర్మాణరంగం సహా నగరంలో వేలాదిగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో పనిచేస్తున్న లక్షలాది మంది తమ సొంతూళ్లకు పయనంకాగా..ఇక్కడున్న వారిలోనూ సింహభాగం ఇళ్లకు వెళ్లేందుకే  సిద్ధమయ్యారు. ఇప్పుడిప్పుడే ఆయా రంగాలు తేరుకుంటున్న తరుణంలోనే పులిమీద పుట్రలా వలసకూలీలు తిరిగి వెళ్లడంతో పలు రంగాల్లో కార్యకలాపాలు స్తంభించనున్నాయి.    

నిర్మాణ రంగం
గ్రేటర్‌ నగరానికి ఐటీ తరవాత మణిహారంగా నిర్మాణరంగం, రియల్‌ ఎస్టేట్‌ రంగాలు నిలుస్తున్నాయి. ఈ రంగంలో సుమారు ఏడు లక్షలమంది వలస కూలీలు పనిచేస్తున్నట్లు నిర్మాణరంగ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్‌ రైళ్లలో సుమారు 70 శాతం మంది ఇంటిబాట పట్టారని..మిగతా 30 శాతం మందితో పనులు నత్తనడకనసాగుతున్నాయని చెబుతున్నారు. నిర్మాణంలో ఉన్న పలు  స్వతంత్ర గృహాలు, విల్లాలు, అపార్ట్‌మెంట్‌ నిర్మాణాలు మరో రెండు నెలలపాటు కూలీలు లేక పనులు అరకొరగా సాగుతాయని బిల్డర్లు ఆందోళన చెందుతున్నారు.

తయారీ పరిశ్రమ
మహానగరంతోపాటు శివారు ప్రాంతాల్లో వేలాదిగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా తయారీరంగం, ఫుడ్‌ప్రాసెస్‌ రంగాలకు చెందిన పరిశ్రమలున్నాయి. వీటిల్లో సుమారు ఐదు లక్షలమంది వలసకూలీలు పనిచేస్తున్నట్లు అంచనా. వీరిలో60 శాతం మంది స్వరాష్ట్రాలకు తరలివెళ్లడంతో ప్లాస్టిక్, స్టీలు, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్‌ విడిభాగాలకు సంబంధించిన పరిశ్రమల ఉత్పత్తి అమాంతం పడిపోనుందని పరిశ్రమల వర్గాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.

ఆతిథ్య రంగం
కోవిడ్‌ దెబ్బకు కుదేలైన ఆతిథ్యరంగంలోనూ లక్షలాదిమంది వలసకూలీలు పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం కూడా ఈ రంగం కోలుకొని పూర్వవైభవం సాధిస్తుందా అన్నది సస్పెన్స్‌గా మారింది. ప్రస్తుతం ఈ రంగంలో పనిచేస్తున్న వలసకార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో ఆతిథ్యరంగానికి సమీప భవిష్యత్‌లోనూ ఆటుపోట్లు తప్పవని హోటల్‌ నిర్వాహకులు చెబుతున్నారు.  

ఇంటీరియర్, ఫర్నిచర్‌
నగరంలో యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌కు చెందిన వేలాదిమంది వలసకూలీలు ఈ రంగాల్లో పనిచేస్తున్నారు. వీరిలో సింహభాగం సొంతిళ్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండడంతో ఈ రంగం కూడా గడ్డు పరిస్థితి ఎదుర్కోనుందని ఈ రంగంలో పనిచేస్తున్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

డెయిరీ
నగరంలోని పలు డెయిరీల్లో వేలాది మంది పనిచేస్తున్నారు. పాడిపశువుల పెంపకం, పలు ప్రైవేటు డెయిరీల్లో హెల్పర్లుగా పనిచేస్తున్నవారిలో చాలామంది వెళ్లిపోవడంతో ఈ రంగం సైతం ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది.  

ఫార్మా  
మహానగరానికి ఆనుకొని సుమారు వెయ్యి వరకు బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్‌ పరిశ్రమలున్నాయి. ప్రస్తుతం మూడు షిఫ్టుల్లో పనిచేసేందుకు అవసరమైన సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నట్లు ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement