వెళ్లనీయరు.. ఉండనీయరు..

Migrant Labourers Suffering With Lockdown Hyderabad - Sakshi

బలవంతంగా పంపిస్తున్న చిన్న పరిశ్రమలు

ఇక్కడే ఉండాలంటున్న భవన నిర్మాణ రంగ యాజమాన్యాలు

పట్టని పాలకులు.. ఆదుకుంటున్న ఎన్‌జీఓలు

బిహార్‌ రాష్ట్రం హసన్‌ బజార్‌ గ్రామానికి చెందిన దశరత్, భార్య పూల్వతిదేవి తమ ఇద్దరు చిన్నారులతో కలిసి ఏడాదిన్నర క్రితం ఉపాధి కోసం భాగ్యనగరానికి వలస వచ్చారు.  నగర శివార్లలోని సూరారంలో బొట్టుబిళ్లలు తయారు చేసే ఒక సూక్ష పరిశ్రమలో భార్య, భర్తలకు పనితోపాటు ఆశ్రయం లభించింది. లాక్‌డౌన్‌తో పనిలేకపోవడంతో యాజమాని సొంతూళ్లకు వెళ్లాలని  కొంత నగదు చేతిలో పెట్టి  బలవంతంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు తీసుకొచ్చి  వదిలి వెళ్లిపోయారు. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచక ప్లాట్‌ఫామ్‌పై కుటుంబం ఉండటంతో ఒక ఎన్జీవో సంస్థ  గుర్తించి సమీపంలోని షెల్టర్‌కు తరలించింది. ఆశ్రయం కల్పించడంతో పాటు, అన్న పానీయాలు అందిస్తూ సొంతూళ్లకు వెళ్లే విధంగా  ప్రయత్నాలు చేస్తోంది.  

లింగంపల్లి సమీపంలోని గోపాల పల్లి తండా గుట్టలపై ఒక కంపెనీకి చెందిన క్వారీలో కంకర కొట్టే పనుల్లో జార్ఖాండ్‌ రాష్ట్రానికి చెందిన సుమారు 13 మంది వలస కార్మికులు పనిచేస్తున్నారు. తమ గ్రామానికి చెందిన వలస కార్మికులందరూ సొంతూళ్లకు వెళ్లిపోవడంతో తాము కూడా వేళ్లేందుకు ప్రైవేటు ట్రాన్స్‌ పోర్టు మాట్లాడుకున్నారు. కానీ  కంపెనీ యజమాని ‡వారిని వదలకుండా పనులు చేయిస్తుండటంతో కార్మికులు తమ సంబంధీకులకు సమాచారం అందించారు. అక్కడి నుంచి ఏపీటీఎస్‌ సోషల్‌ ఫోరం సమన్వయకర్త డేవిడ్‌ సుధాకర్‌కు తెలియడంతో ఆయన  కార్మిక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు స్పందించి కార్మికులను విముక్తి కలిగించగా భూమిక ఎన్జీవో సొంతూళ్ల కు వేళ్ళే విధంగా సహకరించేందుకు ముందుకు వచ్చింది.

సాక్షి, సిటీబ్యూరో:  కరోనా లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం వలస కార్మికులు పరిస్థితి విచిత్రంగా తయారైంది. భవన నిర్మాణ రంగం, వాటి అనుబంధ రంగాల్లో  కార్మికుల కొరతతో సొంతూళ్ల  వెళ్లిన వారిని తిరిగి రప్పించుకునేందుకు ఒక వైపు  తీవ్ర ప్రయత్నాలు జరుగుతుండగా, మరోవైపు అందుబాటులో గల కార్మికులను  బలవంతంగా వెళ్లగొట్టేందుకు చిన్న , మధ్య తరహ పరిశ్రమలు చర్యలకు ఉపక్రమించాయి. దీంతో స్వస్థలాలకు వెళ్లిన కార్మికులు తిరిగి రాలేక...ఇక్కడ ఉన్న కార్మికులకు చేతిలో పనిలేక  స్వస్థలాలకు వెళ్లలేక తల్లడిల్లుతున్నారు. ఏదో రకంగా రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్నా గమ్య స్థానాల వరకు వెళ్లే రైళ్ల  కోసం రోజుల తరబడి  ఎదురు చూడక తప్పడంలేదు. వలస కార్మికులను స్వస్థలాలకు పంపించే బాధ్యతల నుంచి పాలకులు తప్పుకోవడంతో ఎన్జీవోలు ముందుకు వచ్చి రైల్వే స్టేషన్ల సమీపంలో షెల్టర్లను ఏర్పాటు చేసి ఆన్న పానీయాలతోపాటు స్వస్థలాకు వెళ్లే వరకు అన్నీ తామై సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది.

 వెళ్లలేని వారు ఇంకా లక్షన్నర మంది
హైదరాబాద్‌ మహా నగరంలో మరో లక్షన్నర వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లలేక ఇక్కడే ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుమారు 13.50 లక్షల మంది సొంతూళ్లకు చేరుకున్నారు. మిగిలిన వారు సైతం స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. సొంతూళ్లకు తిరిగి వెళ్లలేక  పని దొరుకుతుందన్న ఆశతో లాక్‌డౌన్‌ కష్టాలను సైతం ఎదుర్కొన్నా ఇక్కడే ఉన్న వారికి నిరాశ తప్పడం లేదు. ఇదిలా ఉండగా భవన నిర్మాణ రంగం అనుబంధ రంగాల్లో కార్మికుల కొరత విపరీతంగా ఉంది. సొంతూళ్లకు వెళ్లిన వారిని సైతం తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న వారు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో వలస కార్మికుల విచిత్ర పరిస్థితి నెలకొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top