ఫ్లెక్సీ గండంతో ఆగిన మెట్రో రైలు

Metro rail stopped due to flexi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో రైళ్లకు హోర్డింగులు, వాటిపై ఏర్పాటుచేసిన వాణిజ్య ప్రకటనల ఫ్లెక్సీలు గండంలా పరిణమిస్తున్నాయి. తాజాగా గురువారం జేఎన్‌టీయూ వద్ద ఓ హోర్డింగ్‌కు ఉన్న ఫ్లెక్సీ చిరిగి మెట్రో రూట్‌లోని ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ తీగలపై పడింది. దీంతో సాయంత్రం 5.35 నుంచి 6.05 వరకు మెట్రో రైలును నిలిపివేశారు. ఘటనపై హైదరాబాద్‌ మెట్రో రైలు మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్వీఎస్‌ రెడ్డి స్పందిస్తూ.. ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన ఫ్లెక్సీ మెట్రో ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ తీగలపై పడటంతోనే రైలును 20 నిమిషాల పాటు నిలపాల్సి వచ్చిందన్నారు.

ఈ ఘటనతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. కాగా నగర మెట్రో రైళ్లు ఆధునిక సాంకేతికతతో దూసుకెళ్తాయని గతంలో అధికారులు చెప్పినప్పటికీ.. ఎంఎంటీఎస్‌ తరహాలోనే రైళ్లను తరచూ నిలపాల్సి రావడం పట్ల ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఖైరతాబాద్‌లో రైలు పట్టాలపైనున్న ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ తీగలపై ఓ ఫ్లెక్సీ చిరిగిపడటంతో ఎంఎంటీఎస్‌ రైలును గంటపాటు నిలిపివేసిన విషయం తెలిసిందే. గతంలో నాగోల్‌– అమీర్‌పేట్‌ మార్గంలో రెండుసార్లు ఇలానే ఫ్లెక్సీలు చిరిగి పడటంతో మెట్రో రైళ్లను అరగంటపాటు నిలిపివేశారు.  

అధికారుల నిర్లక్ష్యం వల్లే..
ప్రస్తుతం నాగోల్‌– అమీర్‌పేట్, మియాపూర్‌– అమీర్‌పేట్‌ మార్గంలో 18 మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటికి ఆనుకొని పలు హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఉన్నాయి. వీటిని తొలగించే విషయంలో జీహెచ్‌ఎంసీ, మెట్రో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతోనే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

మరోవైపు ఈ ఏడాది ఆగస్టులో ఎల్బీనగర్‌– అమీర్‌పేట్, అక్టోబర్‌లో అమీర్‌పేట్‌– హైటెక్‌సిటీ మార్గంలోనూ మెట్రో రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో మెట్రో మార్గానికి ఆనుకొని ఉన్న భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తక్షణం తొలగించాలని నిపుణులు, ప్రయాణికులు కోరుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top