చదువుకు ఉపకారం

Merit scholarships for village students - Sakshi

ప్రతిభావంతులకు  కేంద్రప్రభుత్వం చేయూత

గ్రామీణ విద్యార్థులకు మెరిట్‌స్కాలర్‌షిప్‌

సద్వినియోగంతో ఉత్తమ ఫలితాలు

ప్రయోజనం
ఆదిలాబాద్‌, పెగడపల్లి, (ధర్మపురి) : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వపాఠశాలల్లో విద్యనభ్యసించే చిన్నారులను ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం ఎన్‌ఎంఎంస్‌(నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌) జాతీయ ఉపకార వేతనాన్ని 2008లో ప్రవేశపెట్టింది. ఈ పథకంతో ఇప్పటివరకు ఎంతోమంది విద్యార్థులు లబ్ధిపొందారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు ఇదొక మంచి అవకాశం. కొద్ది రోజుల క్రితం ఎన్‌ఎంఎంఎస్‌కు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో విద్యాశాఖ ప్రకటనజారీ చేసింది. ఏటా సెప్టెంబర్‌లో దరఖాస్తులు స్వీకరించి అక్టోబర్‌లో అర్హత పరీక్ష నిర్వహిస్తారు. అయితే ఈ విద్యాసంవత్సరం అక్టోబర్‌ 4నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నవంబర్‌ 5న అన్ని జిల్లా రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలలో అర్హత పరీక్ష నిర్వహించనున్నారు.

దరఖాస్తు ఇలా..
జాతీయఉపకార వేతనానికి దరఖాస్తు ఫారాలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఈతెలంగాణ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు సమర్పించాలి. ఓసీ, బీసీలు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ. 50 దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

జతచేయాల్సిన ధ్రువపత్రాలు
అభ్యర్థులు దరఖాస్తు చేసేప్పుడు కులం, ఆదాయం, ఆధార్, రెండుపాస్‌ఫోర్టు సైజ్‌ ఫొటోలు జత చేయాలి. వాటిని సంబంధిత పాఠశాల హెచ్‌ఎం పరిశీలించి జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపిస్తారు.

వీరు అర్హులు
ప్రభుత్వ జిల్లాపరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ఆదర్శ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు జాతీయ ఉపకార వేతనాలు పొందేందుకు అర్హులు. ఏడో తరగతిలో ఓసీ, బీసీలు 55శాతం, ఎస్టీలు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.500 చొప్పున ఏడాదికి రూ.6 వేలు ఉపకార వేతనం అందిస్తారు. ఇలా ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసేంతవరకు కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాన్ని అందజేస్తుంది. తద్వారా పేద విద్యార్థుల చదువుకు చాలా వరకు మేలు జరుగుతుంది.

సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు ఈ జాతీయ ఉపకార వేతనాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు ఎంతో ఉపయోకరంగా ఉంటుంది. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వి నియోగం చేసుకోవాలి.
– ఎం.శ్రీనివాస్‌ స్కూల్‌ అసిస్టెంట్, సుద్దపల్లి

ప్రోత్సహిస్తాం..
ఈ ఏడాది వీలైనంత మంది విద్యార్థులు అర్హత పరీక్షలో పాల్గొనేందుకు చర్య తీసుకుంటాం. ఉపాధ్యాయులు దీనిపై అవగాహన కల్పించాలి. దగ్గరుండి దరఖాస్తు చేయించాలి. ఇటువంటి పరీక్షల వల్లే విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
– ఎం. అంజారెడ్డి, ఎంఈవో

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top