ఎంఎన్‌జేకు.. ‘నిర్లక్ష్యపు కేన్సర్‌’ | Medical Services Delayed In MNJ Cancer Hospital | Sakshi
Sakshi News home page

ఎంఎన్‌జేకు.. ‘నిర్లక్ష్యపు కేన్సర్‌’

Dec 4 2018 8:36 AM | Updated on Dec 19 2018 11:08 AM

Medical Services Delayed In MNJ Cancer Hospital - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ‘జనగాం జిల్లా, పంచాల గ్రామానికి చెందిన సీహెచ్‌ నర్సయ్య ప్రొస్టెట్‌ కేన్సర్‌తో బాధపడుతున్నాడు. స్థానికంగా ఉన్న వైద్యుల సలహా మేరకు ఆయన గత పదిహేను రోజుల క్రితం చికిత్స కోసం ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రి ఔట్‌పేషెంట్‌ విభాగానికి రాగా పరీక్షించిన వైద్యులు రక్త, మూత్ర సహా సీటీ, ఎంఆ ర్‌ఐ, ఆల్ట్రాసౌండ్, 2డిఎకో వంటి పలు పరీక్షలు చేయించాల్సిందిగా సూచించారు. వైద్యుడు రాసిన చీటీ తీసుకుని సీటీస్కాన్‌ విభాగానికి వెళ్లగా పేరు నమోదు చేసుకుని నాలుగు రోజుల తర్వాత రావాలన్నారు. రిపోర్ట్‌ కోసం మరో మూడు రోజులు వేచి ఉండాలని సూచించారు. పది రోజుల తర్వాత రిపోర్టులతో వైద్యుడిని సంప్రదించగా ..సర్జరీ చేయాల్సి ఉందని చెప్పారు. అయితే ఇప్పటికే చాలా మంది వెయింటింగ్‌లో ఉన్నందున, మరో పదిహేను రోజుల తర్వాత వస్తే అడ్మిట్‌ చేసుకుని సర్జరీ చేస్తామని స్పష్టం చేయడంతో..తెలిసిన వారి సహాయంతో అతికష్టం మీద పది రోజుల క్రితం ఆస్పత్రిలో అడ్మిటయ్యాడు.

అయితే ఇప్పటి వరకు సర్జరీ చేయకపోగా..ప్రస్తుతం అంతా ఎలక్షన్ల బిజీలో ఉన్నారని..మరో వారం రోజుల తర్వాత వస్తే..సర్జరీ చేస్తామని చెప్పి సోమవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. చేసేది లేక ఆయన ఆస్పత్రి నుంచి బయటికి వెళ్లిపోవాల్సి వచ్చింది. అసలే ప్రొస్టేట్‌ కేన్సర్‌.. ఆపై భరించలేని నొప్పితో బాధపడుతున్న నర్సయ్యకు ఇరవై రోజులైనా..కనీస వైద్యసేవలు అందకపోవడంతో శారీరకంగానే కాకుండా మానసికంగా మరింత కుంగిపోతున్నాడు. ఇది ఒక్క నర్సయ్యకు ఎదురైన అనుభవం మాత్రమే కాదు..రొమ్ము, గైనిక్, హెడ్‌ అండ్‌ నెక్, ప్రొస్టేట్‌ కేన్సర్లతో బాధ పడుతూ ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రికి చేరుకుంటున్న వందలాది మంది నిరుపేద రోగులకు ఇక్కడ నిత్యం ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి.   

రిపోర్టుల జారీలో జాప్యం వల్లే..: ప్రతిష్టాత్మక ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రిని నిర్లక్ష్యపు వైరస్‌ పట్టి పీడిస్తోంది. కేన్సర్‌ గాయాలను నయం చేసేందుకు అవసరమైన వైద్యనిపుణులు అందుబాటులో లేకపోవడంతో ఆ గాయం రాచపుండుగా మారి శరీరమంతా విస్తరిస్తుంది. నిరుపేద రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న ఉన్నతాధికారులు సంబంధిత విభాగాల పనితీరును గాలికొదిలేసి సచివాలయం, మంత్రి పేషీ చుట్టు తిరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 1955లో అప్పటి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా 40 పడకల సామర్థ్యంతో ప్రారంభమైన ఈ ఆస్పత్రి 1996లో స్వయం ప్రతిపత్తి పొందింది. ప్రస్తుతం 450 పడకలు, 15 విభాగాలకు విస్తరించింది. ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా సరిహద్దు జిల్లాల రోగులు కూడా వస్తున్నారు. ప్రస్తుతం సర్జరీ విభాగంలో మూడు యూనిట్లు ఉండగా, మూడు ఆపరేషన్‌ టేబుళ్లు మాత్రమే ఉన్నాయి. ఆస్పత్రిలో వైద్యనిపుణులు అందుబాటులో ఉన్నప్పటికీ...సీటీ, ఎంఆర్‌ఐ రిపోర్టుల జారీలో జరుగుతున్న జాప్యం కారణంగా వారు కూడా సకాలంలో చికిత్సలు అందించలేని దుస్థితి. బాధితుల్లో 80 శాతం మంది వ్యాధి తీవ్రత ముదిరిన తర్వాతే ఆస్పత్రికి వస్తుంటారు. తీరా ఆస్పత్రికి వచ్చిన తర్వాత రిపోర్టులు, చికిత్సల్లో జరుగుతున్న జాప్యంతో వ్యాధి మరింత ముదిరి మృత్యువాత పడుతున్నారు. సీటీ, ఎంఆర్‌ఐ మిషన్‌తో కేన్సర్‌ గడ్డలను గుర్తించి సకాలంలో రిపోర్టులను జారీ చేయాల్సిన సంబంధిత విభాగం అధిపతి పరిపాలన విభాగంలో కీలకమైన పోస్టులో కొనసాగుతుండటం, సదరు విభాగంపై పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణమని ఆరోపణలు ఉన్నాయి. 

బతికుండగానే నరకం: ఆస్పత్రిలో ఏటా 12000 కొత్త కేసులు నమోదవుతుండగా, సుమారు లక్ష వరకు పాత కేసులు ఉంటాయి. ప్రస్తుతం ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 500 మందికిపైగా వస్తుండగా, ఇన్‌పేషంట్లుగా మరో 600 మంది చికిత్స పొందుతుంటారు. ఆస్పత్రిలో ఏటా పది వేల కొత్త కేసులు నమోదవుతుండగా, మరో 11 వేల మంది పాల్‌అప్‌  చికిత్సల కోసం వస్తుంటారు. ఇక్కడ ఏటా 1500పైగా మేజర్‌ సర్జరీలు, 1000పైగా మైనర్‌ చికిత్సలు జరుగుతుంటాయి. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేనందున రేడియో, కీమోథెరపీల కోసం వస్తున్న నిరుపేద రోగులు వార్డుల బయట, చెట్లకింద గడపాల్సి వస్తోంది, మరికొందరు ఆర్థికంగా భారమైనా విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్‌కు వెళ్లిపోతున్నారు. అసలే ఎముకలు కొరికే చలి ఆపై కేన్సర్‌తో అనేక మంది రోగులు బతి కుండగానే నరకం చూస్తున్నారు. ఆస్పత్రిలో ఐదు రేడియో థెరపీమెషిన్లు ఉండగా, వీటిలో ఇప్పటికే రెండు మూలన పడ్డాయి. మూడు పని చేస్తుండగా వీటిలో ఒకటి 18 ఏళ్ల క్రితం కొనుగోలు చేయగా, మరొకటి 13 ఏళ్ల క్రితం కొనుగోలు చేసినది కావడం గమనార్హం. రోగుల తాకిడి దృష్ట్యా ఆయా మిషన్లు రోజంతా పని చేయాల్సి వస్తుండటంతో తరచూ సాంకేతికలోపాలు తలెత్తుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement