ఉద్యోగులకు వైద్య ప్రదాయినిగా దక్షిణ మధ్య రైల్వే

Medical Services Brought To Home For Employees In Lalaguda Railway Hospital - Sakshi

కోవిడ్‌ నియంత్రణలో దక్షిణమధ్య రైల్వే 

సత్ఫలితాలిస్తున్న ఇంటి వద్దకే వైద్యం  

ఇప్పటికే 1500 మందికి మందుల పంపిణీ 

లాలాగూడ ఆస్పత్రిలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు 

కోవిడ్‌ వారియర్స్‌గా స్వచ్ఛంద సేవకులు  

సాక్షి, హైదరాబాద్‌ : ఒకవైపు లాక్‌డౌన్‌. మరోవైపు కరోనా ఉద్ధృతి. పొంచి ఉన్న వైరస్‌ ముప్పు. ఇది వయోధికులకు, దీర్ఘకాలిక రోగులకు  మరింత  ప్రమాదకరమైన పరిణామం. దీనిని దృష్టిలో ఉంచుకొని  దక్షిణమధ్య రైల్వే ఇటీవల చేపట్టిన వినూత్న కార్యక్రమం రైల్వే కార్మికులకు, ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు వరప్రదాయినిగా మారింది. కరోనా వ్యాప్తి దష్ట్యా  ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్య సేవలు స్తంభించినప్పటికీ  లాలాగూడలోని ద.మ రైల్వే కేంద్రీయ ఆస్పత్రి మాత్రం ఉద్యోగుల వద్దకే వైద్య సేవలను తీసుకెళ్లింది.

ఒకవైపు అన్ని రకాల వైద్య సదుపాయాలను కొనసాగిస్తూనే మరోవైపు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి  అవసరమైన మందులను వారి ఇళ్ల వద్దకే చేరవేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛంద కార్యకర్తలు కోవిడ్‌ వారియర్స్‌గా పని చేస్తున్నారు.నెల రోజులకుపైగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో  ఇప్పటి వరకు 1500 మందికిపైగా ఉద్యోగులకు వారి ఇళ్ల వద్ద మందులను అందజేశారు.

ముఖ్యంగా మూప్రిండాల వ్యాధులు, గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ కోవిడ్‌ హైరిస్క్‌ గ్రూపులో ఉన్నవారికి  ఈ పథకం గొప్ప ఊరటనిస్తోంది. రెండు రోజుల క్రితం దక్షిణమధ్య రైల్వే జనరల్‌  మేనేజర్‌ గజానన్‌ మాల్యా దీనిపై అధికారులు, ఆస్పత్రి వైద్య నిపుణులతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకాన్ని మరింత బలోపేతం చేయాలని, దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అవసరమైతే కోవిడ్‌ వారియర్స్‌ను అదనంగా ఏర్పాటు చేసుకొని అవసరమైన వారికి సత్వరమే ఇళ్ల వద్ద మందులు అందజేసేలా సేవలను విస్తరించాలని సూచించారు.  

ప్రత్యేక బృందం ఏర్పాటు.. 
ఈ పథకాన్ని విజయవంతంగా కొనసాగించేందుకు ఆస్పత్రిలో సీనియర్‌ వైద్య నిపుణుడితో పాటు, ఒక స్టాఫ్‌నర్స్, మరో సీనియర్‌ ఫార్మాసిస్ట్‌తో ఒక టీమ్‌ను ఏర్పాటు చేశారు. వాట్సప్‌ నంబర్‌ల ద్వారా ఉద్యోగుల నుంచి అందిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకొని వారికి అవసరమైన మందులను స్వచ్ఛంద కార్యకర్తల ద్వారా ఇళ్లకే పంపిస్తున్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి 2 నెలలకు సరిపడా మందులను అందజేస్తుండగా, ఉద్యోగులకు, కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు మాత్రం ఒక నెలకు అవసరమైన మందులను  అందజేస్తున్నారు. ఈ క్రమంలో అత్యవసర వైద్య సేవలు కావాల్సినవారికి ఆస్పత్రిలోనే చికిత్సలు అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

దక్షిణమధ్య రైల్వే పరిధిలోనే అతి పెద్దదైన లాలాగూడ కేంద్రీయ ఆస్పత్రిలో అన్ని రకాల అత్యవసర వైద్య విభాగాలు ఉన్నాయి. కార్పొరేట్‌ తరహా వైద్య సేవలను ఉద్యోగులకు అందజేస్తున్నారు. కార్పొరేట్‌ వైద్య నిపుణులను కూడా పిలిపిస్తున్నారు. ప్రతి రోజు 3000మందికి పైగా రోగులకు ఓపీ సేవలను అందజేస్తున్నారు. ఒకవైపు కోవిడ్‌ తీవ్రత కొనసాగుతున్న తరుణంలోనూ వైద్య సదుపాయాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ద.మ రైల్వే పటిష్టమైన చర్యలు చేపట్టింది. మరోవైపు రైల్వే ఆస్పత్రుల్లో కేవలం రైల్వే ఉద్యోగులకు కాకుండా అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉద్యోగులు, వారి కుటుంబాలకు కూడా వైద్య సేవలను విస్తృతం చేశారు. కోవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు  దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌.రాకేష్‌  తెలిపారు.  

వాట్సప్‌ నంబర్లకు వివరాలు పంపితే చాలు.. 
మందులు అవసరమైన పేషెంట్లు తమ వివరాలను ఆస్పత్రి సూచించిన ఫోన్‌ నంబర్‌లకు వాట్సప్‌ ద్వారా తెలియజేస్తే చాలు. గతంలో వైద్యులు రాసిన మందుల ప్రిస్కిప్షన్‌ ఆధారంగా ప్రస్తుతం అవసరమైన మందులను వారికి పంపిస్తారు. 

మందులు ఇలా అందుకోవచ్చు.. 
వాట్సప్‌ నంబర్లు: 970137055, 9618936328. 
ఈ నంబర్లకు  పేషెంట్‌ పేరు, ఉద్యోగి పేరు, మెడికల్‌ కార్డు , గతంలో డాక్టర్‌ రాసిన ప్రిస్కిప్షన్‌ పంపించాలి  
చిరునామా, ల్యాండ్‌మార్క్‌ కూడా తెలియజేయాలి 
రైల్వే విశ్రాంత ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. 
60 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను చేరుకోవడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top