మే 5 నుంచి మెడికల్‌ పీజీ తరగతులు

Medical PG Classes Start From May 5th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విద్యా ఏడాది 2018–19 వైద్య విద్య పీజీ కోర్సుల తరగతులు మే 5 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కాలేజీల్లోని పీజీ, డిప్లొమా సీట్ల భర్తీ ప్రక్రియను కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం ప్రారంభించింది. నేషనల్‌ పూల్‌ పద్ధతిలో సీట్ల భర్తీ చేయనున్నారు. ఈ ప్రవేశాలకు నీట్‌–2018లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు 321, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు 281, దివ్యాంగులకు 300 మార్కులను కటాఫ్‌గా పేర్కొన్నారు.

ఈ నెల 31లోపు ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల ప్రక్రియ ఆన్‌లైన్‌ పద్ధతిలోనే జరగనుంది. శుక్రవారం ఉదయం పది గంటలకు మొదలైన ఈ ప్రక్రియ మార్చి 28 సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది. మార్కుల జాబితా ఆధారంగా ఈ నెల 30న మెరిట్‌ జాబితాను విశ్వవిద్యాలయం వెల్లడించనుంది. మార్చి 31న సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. అనంతరం అభ్యర్థుల సీట్ల కోసం ఆప్షనల్స్‌కు అవకాశం కల్పిస్తారు. 

ఆ వైద్యులకు అదనపు మార్కులు  
రాష్ట్రంలో 14 వైద్య విద్యా సంస్థల్లో మెడికల్, సర్జరీ, గైనకాలజీ, నాన్‌ క్లినికల్‌ గ్రూపుల్లో 1,023 పీజీ, డిప్లొమా సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ శాఖలోని గిరిజన ప్రాంత ప్రభుత్వ ఆస్పత్రుల్లో వరుసగా మూడేళ్లు పని చేసిన వారికి ఏడాదికి 10% చొప్పున, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వరుసగా మూడేళ్లు పని చేసిన వారికి ఏడాదికి 8% చొప్పున అదనపు మార్కులు కలుపుతారు. పీజీ కోర్సులో చేరే వారు రూ. 5 లక్షల మొత్తానికి బాండ్‌ సమర్పించాలి. ఈ మొత్తాన్ని కాళోజీ విశ్వవిద్యాలయం తిరిగి చెల్లిస్తుంది. అలాగే తెలంగాణలోనే వైద్య సేవలు అందిస్తానని అంగీకరిస్తూ మరో బాండ్‌ సమర్పించాల్సి ఉంటుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top