అనారోగ్యానికి గురికావడంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి ఒడిగట్టింది. ఈసంఘటన మండల పరిధిలోని కుడకుడ గ్రామంలో
కుడకుడ(చివ్వెంల) : అనారోగ్యానికి గురికావడంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి ఒడిగట్టింది. ఈసంఘటన మండల పరిధిలోని కుడకుడ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెన్‌పహాడ్ మండలం భక్తాళ్లాపురం ఆవాసం ఎర్రంశెట్టి గూడెంకు చెందిన నెమ్మాని కోటేశ్వర్‌రావుతో కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం తంగెళ్లపహాడ్ గ్రామానికి చెందిన అనూష (25)తో 2008లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు శ్యామ్, ధనుష్ ఉన్నారు. భర్త వృత్తి రీత్యా తుంగతుర్తి మండలం గుమ్మడవెల్లి గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పిల్లల చదువుల కోసం మూడు నెలల కిందట కుడకుడ గ్రామంలోని వినాయక్‌నగర్‌లో అద్దెకు ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్లారు.
భర్త కోటేశ్వర్‌రావు కూడా పనిపై బయటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూలేని సమయం చూసి అనూష చీరతో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చాలాసేపటి తర్వాత ఇంటికి పిల్లలు ఒక్కసారిగా కేకలు వేయడంతో ఇరుగు పోరుగు వారు వచ్చి మృతదేహాన్ని కిందకు దింపారు. తన చావుకు ఎవరు కారణం కాదని, అనారోగ్యంతో చనిపోతున్నట్టు మృతురాలు సుసైడ్ నోట్ రాసింది. ఇదిలావుండగా తన భార్య థైరాయిడ్ సమస్యతో చాలా రోజులుగా బాధపడుతుందని, ఈ కారణంగానే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటుందని మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలావుండగా ఈ మృతిపై ఇరుగుపొరుగువారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.