‘మాయమాటల టీఆర్‌ఎస్‌ సర్కారు’

Mallu bhatti Vikramarka Visits Bhupalpally Health Centre - Sakshi

సాక్షి, భూపాలపల్లి : రాష్ట్రంలో మాయమాటల సర్కారు కొనసాగుతుందని, విద్య, వైద్యరంగాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించి ప్రజలను భయానక పరిస్థితుల్లోకి నెట్టిందని కాంగ్రెస్‌ శాసన సభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆదివారం భట్టివిక్రమార్క, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ములుగు ఎమ్మెల్యే సీతక్క పరిశీలించారు. తొలుత హాస్టల్‌లోకి వెళ్లి వంటగది, డైనింగ్‌ హాల్‌ను పరిశీలించి విద్యార్థులకు వడ్డిస్తున్న కిచిడీని చూశారు. అనంతరం పీహెచ్‌సీని పరిశీలించి అక్కడే విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. భూపాలపల్లి పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఆరు పడకల పీహెచ్‌సీతోనే కాలం వెల్లదీస్తున్నారన్నారు. ఆపరేషన్‌ థియేటర్‌ను స్టోర్‌ రూంగా మార్చారని, ఒకే ఒక డాక్టర్‌ అందుబాటులో ఉన్నారని, స్పెషలిస్ట్‌లు ఎవరూ లేరన్నారు. ఓపీలో ఒకే ఒక మహిళ ఉందంటే ప్రభుత్వ  ఆస్పత్రి మీద ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. వెంటనే వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఇక్కడికి వచ్చి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పేషెంట్లు ఎందుకు ఉన్నారు.. ప్రభుత్వ ఆస్పత్రిలో ఎందుకు లేరో తెలుసుకోవాలన్నారు.

ఆస్పత్రులో కుక్కలు, కోతులు కరిచినప్పుడు వేసే ఇంజక్షన్‌కు సంబంధించిన సిరంజీలు కూడా అందుబాటులో లేవన్నారు. మంచినీటి సౌకర్యం లేదని, మందులు సరిపడా లేవన్నారు. ఆరేళ్లలో ఒక్క డాక్టర్‌ను కూడా రిక్రూట్‌ చేయని ప్రభుత్వంగా టీఆర్‌ఎస్‌ చరిత్రలో నిలుస్తుందన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో భోజనం అధ్వానంగా ఉందన్నారు. 280 మందికి 30 కేజీల బియ్యంలో అరకిలో పప్పు వేసి ఉడికించారన్నారు. ఇదీ కిచిడీనా అని ప్రశ్నించారు. వంద గ్రాముల నూనె, పావుకిలో ఉల్లిగడ్డ, అరకిలో చింతపండుతో చారు చేశారని వంట మనుషులే చెబుతున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ మనువడు కూడా ఇలాగే తింటున్నాడా అని ప్రశ్నించారు. పిల్లల పేరు చెప్పి దోపిడీ చేసే ఈ ప్రభుత్వానికి పాపం తగులుతదన్నారు. సింగరేణి కార్మికులకు రూ.10 లక్షల రుణం, వారసత్వ ఉద్యోగాలు, పదివేల క్వార్టర్ల నిర్మాణం ఏమైందని ప్రశ్నించారు. అనంతరం టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఏదో ఒక పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు.

మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి అంటున్నారన్నారు. చిట్యాలలో గైనకాలజిస్ట్‌ లేక బాలింత, బిడ్డ మృతి చెందినప్పటికీ ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదా అన్నారు. రాష్ట్రంలో గడిన 9 నెలల్లో కోటి 20 లక్షల మందికి విష జ్వరాలు సోకినా తగు చర్యలు తీసుకోలేదన్నారు. అనంతరం ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఉండడం లేదన్నారు. కేసీఆర్‌ కిట్‌కు కొంత మేరకు ఆదరణ లభిస్తే దాన్నే సాకుగా చూపిస్తూ ప్రభుత్వ ఆస్పత్రులకు ఆదరణ పెరిగిందనడంలో అర్థం లేదన్నారు. పథకాల పేరుతో ప్రైవేట్‌ ఏజెన్సీలకు ప్రభుత్వం లాభం చేకూరుస్తుందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఐత ప్రకాష్‌రెడ్డి, ఐఎన్‌టీయూసీ కేంద్ర కమిటీ నాయకుడు జనక్‌ప్రసాద్, కాంగ్రెస్‌ నాయకులు ఇస్లావత్‌ దేవన్, బుర్ర రజనీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top