మహారాజశ్రీ మొక్కజొన్న..

Maize Checks Plastic problems at Shamshabad Airport - Sakshi

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్లాస్టిక్‌ సమస్యకు చెక్‌ చెప్పిందన్న..

మొక్కజొన్నేంటి.. అదీ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్లాస్టిక్‌ సమస్యలకు పరిష్కారం చూపడమేంటి? దానికీ.. దీనికీ సంబంధమేంటి? ఇదే కదా మీ అనుమానం.. జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌) దేశంలోనే తొలిసారిగా ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.. ఆ వివరాలు మీకోసం..  – సాక్షి, హైదరాబాద్‌

అసలు సమస్యేంటి?  
ఈ ఎయిర్‌పోర్టుకు రోజూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. అలాగే  ఎయిర్‌పోర్టుకు వచ్చే వారి బంధువులు, స్నేహితులు, పర్యాటకులతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. వీరందరికీ టీ, కాఫీలు, భోజనం, తాగునీరు కావాలి. అక్కడ ఇవన్నీ ప్లాస్టిక్‌ ప్యాకింగ్‌తోనే లభిస్తాయి. దీంతో నిత్యం టన్నుల కొద్ది ప్లాస్టిక్‌ వ్యర్థాలు పోగవుతున్నాయి. ఇదో పెద్ద సమస్యగా మారింది. దీంతో ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎయిర్‌పోర్టులో ఎలాంటి ప్లాస్టిక్‌ వినియోగానికి తావు లేకుండా చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఐఏఎల్‌ నిర్ణయించింది. దీనికి మొక్కజొన్నే పరిష్కారమని భావించింది.  

పరిష్కారమిలా...
మొక్కజొన్నతో తయారు చేసిన ప్లేట్లు వంటివాటికి  భూమిలో కలిసిపోయే గుణం ఉంది. పైగా.. ఒక రోజులో 2 టన్నుల వ్యర్థాలను ఎరువుగా మార్చే సామర్థ్యమున్న కంపోస్ట్‌ ప్లాంట్‌ ఎయిర్‌పోర్టుకు ఉంది. దీంతో పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ వస్తువుల స్థానంలో మొక్కజొన్న, చెక్క తదితరాలతో తయారు చేసిన ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలు, ట్రేలు, ఫోర్క్‌లు, స్ట్రిరర్లు, స్పూన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయాణికులు వాడిపారేసిన తర్వాత ఆ వ్యర్థాలను సేకరించి.. కంపోస్టు ప్లాంటుకు తరలిస్తారు. దాన్ని అది ఎరువుగా మారుస్తుంది. ఇప్పటికే ఈ ప్లాంట్‌ ద్వారా ఉత్పత్తి అయిన కంపోస్టును ఎయిర్‌పోర్టులో మొక్కలకు ఎరువులుగా వాడుతున్నారు. రసాయనిక ఎరువులు వాడకుండా ఈ రకంగానూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నారు. జీహెచ్‌ఐఏఎల్‌ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ విధానానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన వస్తోంది.  

 పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఈ ప్లేట్ల వినియోగాన్ని ప్రవేశపెట్టాం. మా వద్ద10 మెగావాట్ల సోలార్‌ ప్లాంటు, కంపోస్ట్‌ ప్లాంటు, ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ యూనిట్, నీటి పరిరక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఎయిర్‌పోర్టు సిబ్బందీ ప్లాస్టిక్‌ బ్యాగుల స్థానంలో వస్త్రంతో చేసిన సంచులనే వాడుతున్నారు.      
–ఎస్జీకే కిశోర్, సీఈవో, జీహెచ్‌ఐఏఎల్‌  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top