వైభవంగా కుంభమేళా

Maha Kumbha Mela In Manjeera River - Sakshi

మంజీరలో భక్తుల పుణ్యస్నానాలు

ఆలయాన్ని సందర్శించిన సాధువులు

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): కుంభమేళాకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో మంజీర నది కోలాహలంగా మారింది. రాఘవాపూర్‌–హుమ్నాపూర్‌ గ్రామాల శివారులో కొనసాగుతున్న కుంభమేళా ఆరో రోజు కూడా భక్తుల తాకిడి పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వేకువజామున వచ్చిన భక్తులు మంజీరలో పుణ్యస్నానాలచరించారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు నదిలో స్నానాలు చేసి గంగామాతకు పూజలు నిర్వహించారు. అనంతరం గంగాదేవి ఆలయంలో పూజలు చేసి దైవదర్శనం చేసుకున్నారు. ఆలయ ఆవరణలో ఉన్న శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యజ్ఞా, హోమాలు కొనసాగుతున్నాయి. కుంభమేళాలో భక్తుల కోలాహలంతో పాటు సాధువుల సంతుల సందడి నెలకొంది. భక్తులు దిగంబర సాధువులను దర్శించుకున్నారు. సాయంత్రం సాధువుల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. అలాగే భక్తులు పంచవటిలో వెలసిన శారదాదేవి, సాయిబాబ, శనీశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రత్యేక పూజలు చేసిన వెంకటస్వామి
ఉదయం కుంభమేళాకు వచ్చిన రుస్తుపేట పీఠాధిపతి వెంకటస్వామికి పంవచటి క్షేత్రం పీఠాధిపతి కాశీనాథ్‌బాబా ఘనంగా స్వాగతం పలికారు. ఆయనతో కలసి మంజీర నది వద్ద గంగామాతకు పూజలు నిర్వహించారు. అనంతరం వెంకటస్వామి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం శుభదినాలు ఉన్నందున భక్తులు మంజీరలో పుణ్యస్నానాలచరించాలన్నారు. లోక కల్యాణార్థమై ఈ ప్రాంతంలో కాశీనాథ్‌బాబా కుంభమేళా నిర్వహించడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పుణ్యమన్నారు. ప్రతి ఒక్కరూ అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top