పూలవనం.. ఎల్బీ స్టేడియం

Maha Batukhamma celebrations as grand at Lb stadium

అంగరంగ వైభవంగా మహా బతుకమ్మ వేడుకలు

సాక్షి, హైదరాబాద్‌: మంగళవారం నాడు ఉయ్యాలో.. లేచెనే గౌరమ్మ ఉయ్యాలో..చన్నీటి జలకాలు ఉయ్యాలో..ఆడెనే గౌరమ్మ ఉయ్యాలో..ముత్యమంత పసుపు ఉయ్యాలో..ముఖమంతా పూసి ఉయ్యాలో..చింతాకు పట్టుచీర ఉయ్యాలో..చింగులు మెరవంగ ఉయ్యాలో.. రంగురంగుల బతుకమ్మలు.. తీరొక్క పూల గుబాళింపు..  వినసొంపైన జానపదాలు.. కోలాటాలు.. వేలాది మంది ఆడపడుచుల ఆటపాటలు.. మంగళవా రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం ముద్దబంతై మురి సింది! సాయంత్రం నిర్వహించిన మహా బతుకమ్మ వేడుక ఆనందోత్సాహాల మధ్య అంగరంగ వైభవంగా సాగింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది పడతులు తరలి వచ్చి బతుకమ్మ ఆడారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురా లు, ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ వేడుకలను ప్రారంభించారు. మహిళలతో కలసి బతుకమ్మ ఆడారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సాంస్కృ తిక వైభవాన్ని చాటేదే బతుకమ్మ అని చెప్పారు. ‘‘గతంలో బతుకమ్మ ఆట ఆడుకునేందుకు నగరంలో కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అదే హైదరాబాద్‌లో వేలాది మందితో మహా బతుకమ్మ నిర్వహించడం ఆనందంగా ఉంది. ఎల్బీ స్టేడియం పూలవనాన్ని తలపిస్తోంది. అన్ని జాతులు కలిస్తేనే మానవ జాతి. అన్ని పూలు కలిస్తేనే బతుకమ్మ’’ అని అన్నారు. శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాధించేందుకు మహిళలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. బహ్మకుమారి డైరెక్టర్‌ బీకే కులదీప్‌ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తోందన్నారు.

అందరిదీ ఒకే కుటుంబం.. అంతా కలసి పువ్వుల్లా నవ్వులు చిందించిననప్పుడే విశ్వశాంతి పరిఢవిల్లుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందు కు దేశంలోని 15 రాష్ట్రాల నుంచి తమ ప్రతినిధులు తరలివచ్చారన్నారు. ఈ వేడుకకు రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మందికిపైగా మహిళలు తరలివచ్చినట్టు అంచనా. రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, పర్యాటక శాఖ ఎండీ క్రిస్టినా చొంగ్తు, కార్యదర్శి బుర్రా వెంకటేశం, హైదరాబాద్‌ కలెక్టర్‌ యోగితా రాణా పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top