వారం రోజుల్లో పడిపోయిన బంతి పూల ధరలు
ఒక కేట్ పూలు రూ.100కు కొనేవారు కరువు
పెట్టుబడి కూడా రాదంటూ రైతుల ఆందోళన
రామభద్రపురం: నిన్నమొన్నటి వరకు వరుస తుఫాన్లు వివిధ పంటలపై ప్రభావం చూపాయి. అధిక వర్షాలు పంటలకు నష్టం చేకూర్చి రైతుకు కన్నీరుమిగిల్చాయి. పెట్టుబడి పెట్టి ఏదోలా పంటలను కాపాడుకుంటే దిగుబడులు అమాంతం తగ్గాయి. వారం రోజులుగా ధరలు కూడా పతనం కావడంతో పూల రైతులు కుదేలవుతున్నారు. కిందటి వారం వరకు విజయనగరం జిల్లా రామభద్రపురం అంతర రాష్ట్రమార్కెట్‌లో రూ.450 నుంచి రూ.500 పలికిన కేట్ (ట్రే) బంతి పూలధర ఇప్పుడు రూ.100కు పడిపోయింది.
ఆ ధరకు కూడా పూలు కొనుగోలు చేసేవారి కోసం రైతులు మార్కెట్‌లో ఎదురుచూడాల్సిన దుస్థితి. పూల రైతు కుదేలవుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. మద్దత ధర కల్పించే మార్గం చూపడంలేదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతన్నకు కష్టాలు, కన్నీరే మిగులుతాయని నిట్టూర్చుతున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న, అరటి, ఉల్లి వంటి ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదంటూ రైతులు దిగులుచెందుతున్నారు.
పెట్టుబడి కూడా రాదు
ఈ ఏడాది వరుస తుఫాన్ వర్షాలకు బంతి పంట పూర్తిగా పాడయింది. ఉన్నకాడికి మొక్కలను బతికించాం. సస్యరక్షణ చర్యలు చేపట్టడంతో మొక్కలు పూతకొచ్చాయి. ఇప్పుడు ధర లేదు. రామభద్రపురం మార్కెట్‌లో మూడు కేట్‌లు (ఒక్కో కేట్‌లో సుమారు 1000పూలు) రూ.200కు విక్రయించాను. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. – తూముల ఈశ్వరమ్మ, పూల రైతు, రామభద్రపురం
కొనుగోలు చేసేవారే లేరు
ఆరుగాలం శ్రమించి వేలకువేలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేశాను. మంచి దిగుబడి వచ్చే సమయానికి మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేదు. ఎంతో కొంతకు అమ్ముదామనుకున్నా కొనేవారు కరువయ్యారు. కార్తీక మాసం పూర్తికావడం, శుభకార్యాలు లేకపోవడంతో బంతిపూలకు డిమాండ్ తగ్గింది. ఖర్చులు అధికం కావడంతో నష్టాలు వస్తున్నాయి. ప్రభుత్వం ఆదుకోవాలి. – కర్రి లక్ష్మణ, పూలరైతు, రామభద్రపురం


