ఫార్మాపై ‘లాక్‌డౌన్‌’ ప్రభావం

Lockdown Effect On Pharma Sales In Telangana - Sakshi

తగ్గిపోయిన మందుల అమ్మకాలు

ఇన్ఫెక్షన్ల మందుల్లో ఏకంగా 30 శాతం.. గైనిక్‌ 25 శాతం తగ్గుదల: ఇక్వియా సర్వే

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ ప్రభావం ఫార్మా అమ్మకాలపై ప డింది. ఆంక్షల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి నెల ఏప్రిల్‌లో మందుల అమ్మకాలు 12% తగ్గాయని ఇక్వియా అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు మూసివేయడం, ప్రజలు బయటకు వచ్చే పరిస్థితులు లేకపోవడంతోపాటు తయారీ కంపెనీలకు ఉత్పత్తి, పంపిణీ, నిల్వ చేసుకోవడంలో ఉన్న ఇబ్బందులు మందుల అమ్మకాలను గత మూడేళ్ల స్థాయికి దిగజార్చాయని తేలింది. ఒకటి, రెండు కీలక ఆరోగ్య సమస్యలకు సంబంధించిన మందులు మినహా అన్ని రకాల ట్యాబ్లెట్లు, టానిక్‌ల అమ్మకాలు పడిపోయాయని, జీఎస్టీ అమల్లోకి వచ్చిన 2017 జూలై నుంచి దేశంలో ఈ స్థాయిలో ఫార్మా అమ్మకాలు పడిపోవడం ఇదే తొలిసారని ఆ సర్వే వెల్లడించింది.

ఆ నాలుగు కలిపి 40 శాతం తగ్గాయి
వాస్తవానికి 2020–21 ఆర్థిక సంవత్సరంలో 1–5 శాతం మేర ఫార్మా అమ్మకాలు పెరుగుతాయనే అంచనా ఉండేది. అందుకు తగినట్టుగానే గత మూడేళ్లుగా ఈ రంగం అమ్మకాల్లో వృద్ధి కనిపిస్తోంది. కానీ, లాక్‌డౌన్‌ దెబ్బతో అంచనాలు తప్పాయి. ఏకంగా మొదటినెలలోనే 12 శాతం విక్రయాలు తగ్గిపోవడం గమనార్హం. ఇక, గ్యాస్ట్రో, ఇన్ఫెక్షన్‌లు, నొప్పులు, విటమిన్‌ మాత్రల అమ్మకాలు కలిపి 40 శాతం అమ్మకాలు తగ్గిపోయాయి. వీటికి తోడు చర్మ వ్యాధులు, న్యూరో వ్యాధులకు సంబంధించిన మందుల అమ్మకాల్లో కూడా తగ్గుదల కనిపించగా, షుగర్, గుండె సంబంధిత వ్యాధుల నియంత్రణకు ఉపయోగించే మందుల అమ్మకాలు మాత్రం పెరిగాయని ఇక్వియా సర్వేలో వెల్లడైంది.

మందుల అమ్మకాలు తగ్గాయిలా
ఆరోగ్య సమస్య                     తగ్గిన శాతం
ఇన్‌ఫెక్షన్‌ మందులు              30.8
స్త్రీ సంబంధిత మందులు         25.5
చర్మ వ్యాధుల మందులు        23
నొప్పుల మందులు                21.6
గ్యాస్ట్రో, పేగు సంబంధిత         15.8
న్యూరో వ్యాధులు                  0.5
కాగా, షుగర్‌ వ్యాధికి ఉపయోగించే మందులు 10 శాతం, గుండె సంబంధిత వ్యాధులకు ఉపయోగించేవి 13 శాతం అమ్మకాలు పెరిగాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top