విస్తరిస్తున్న కుష్ఠు 

Leprosy Disease Survey Adilabad Health Department - Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో కుష్ఠు వ్యాధి విస్తరిస్తోంది. చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అంటు వ్యాధి కావడంతో ఆందోళనకు గురిచేస్తోంది. తగిన సమయంలో చికిత్స తీసుకోకుంటే దుష్పరిణామాలు ఉండే అవకాశం ఉంది. అవగాహన లేమి, నిరక్షరాస్యత కారణంగా ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. వ్యాధి నిర్మూలన కోసం మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం నుంచి ఫిబ్రవరి 13 వరకు జిల్లాలో పక్షోత్సవాలను వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తోంది. గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేసి వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే జిల్లాలో వ్యాధిగ్రస్తుల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాధిగ్రస్తులు చికిత్స చేసుకోవడానికి ముందుకు రాకపోవడంతో వ్యాధి ముదిరిన తర్వాత ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. 2017–18 సంవత్సరంలో వ్యాధిగ్రస్తులు 64 మంది ఉండగా, 2018 సంవత్సరంలో వ్యాధిగ్రస్తుల సంఖ్య 118కి చేరింది. వ్యాధి నివారణ కోసం రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
 
జిల్లాలో ఇదీ పరిస్థితి 
ఆదిలాబాద్‌ జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తులు 108 మంది ఉన్నట్లు వైద్య శాఖ అధికారులు నిర్ధారించారు. కాగా ఇటీవల నిర్వహించిన కుష్ఠు వ్యాధిగ్రస్తుల ఇంటింటి సర్వేలో వీరిని గుర్తించారు. 2017–18 సంవత్సరంలో 137 కేసులు ఉండగా, ఈఏడాది 104 కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో మరికొంత మంది వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర జిల్లాలతో పోల్చితే కుష్ఠు వ్యాధిగ్రస్తులు జిల్లాలో ఎక్కువగానే ఉన్నారు. 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 92 మంది, ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 16 మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

స్పర్ష లేని మచ్చలు ఉన్నవారు దాదాపు 10వేల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వీరికి వైద్య పరీక్షలు చేస్తే ఎంతమందికి వ్యాధి ఉందో.. లేదో తేలుతుందని పేర్కొంటున్నారు. కాగా అత్యధికంగా ఆదిలాబాద్‌ మండలంలో 30 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. జిల్లాలో కుష్ఠు నివారణ కార్యక్రమం 1975 సంవత్సరం నుంచి అమలవుతోంది. అయితే గతం కంటే ప్రస్తుతం వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టిందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. 1991 సంవత్సరం నుంచి ఇప్పటివరకు 38,335 మందికి వ్యాధి నిర్ధారణ కాగా, 38,145 మందికి పూర్తిగా చికిత్స ద్వారా నయం అయిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో 108 మంది వ్యా«ధిగ్రస్తులు ఎండీటీ చికిత్స పొందుతున్నారని తెలిపారు.

మైకోలెప్రి బ్యాక్టీరియాతో.. 
కుష్ఠు వ్యాధి మైకో బ్యాక్టీరియా లెప్రి అనే బ్యాక్టీరియాతో సోకుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకు వస్తుంది. సరైన సమయంలో వైద్యం చేయించుకోకపోతే ఒకరి నుంచి మరోకరికి వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన తర్వాత 3–15 సంవత్సరాల తర్వాత దుష్పరిణామాలు బయటపడుతాయి. తొలిదశలో వ్యాధిని నిర్ధారించుకొని ఎండీటీ చికిత్స పొందితే అంగవైకల్యం రాకుండా కాపాడవచ్చు. శరీరంలో ఎరుపు రంగు, రాగి రంగు స్పర్శ లేని మచ్చలు ఉంటే వ్యాధిగా గుర్తించవచ్చు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top