కొంగరకలాన్‌లో దర్జాగా కబ్జా! 

Land Encroachments Are More In Ibrahimpatnam - Sakshi

ఫిరంగి నాలాపై అక్రమార్కుల కన్ను

బఫర్‌ జోన్‌లో యథేచ్ఛగా నిర్మాణాలు

ఆదిబట్ల మున్సిపల్‌ పరిధిలో రెచ్చిపోతున్న రియల్టర్లు

సాక్షి, ఇబ్రహీంపట్నం: కాదేదీ కబ్జాకనర్హం.. అనేలా సాగుతోంది అక్రమార్కుల వ్యవహారం. కాలువ, కుంట, చెరువు దేన్నీ వదలడం లేదు. కాసుల కోసం సహజ వనరులను ధ్వంసం చేస్తున్నారు. చెరువులు, కుంటలను చెరబడుతున్నారు. వీరి దెబ్బతో జలాశయాలు, కాలువలు ఉనికిని కోల్పోతున్నాయి. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందనే ఆరోపణలున్నాయి. అందుకే ఫిర్యాదులను సైతం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల మధ్య 
సమన్వయ లోపంతో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. 

ఆదిబట్ల మున్సిపల్‌ పరిధిలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోతున్నారు. ధనార్జనే ధ్యేయంగా ఎంతకైనా తెగిస్తున్నారు. ఈ ప్రాంతంలో బహుళ జాతి సంస్థలు, ఔటర్‌ రింగ్‌రోడ్డు, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ భవన సముదాయం రావడంతో ప్రస్తుతం ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదునుగా కబ్జారాయుళ్లు బరితెగిస్తున్నారు.   

అధికారులే అండ..
రియల్‌ ఎస్టేట్‌ అక్రమార్కులకు అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువులు, కుంటలు, వాగులు, కాలువలు కబ్జాకు గురైనట్లు తెలిసినా కనీసం స్పందించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇరిగేషన్‌ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్‌ అధికారులను అడిగితే తాము రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని తప్పించుకుంటున్నారని చెబుతున్నారు. ఎట్టకేలకు అన్నింటి మీద అధికారులకు ఫిర్యాదు చేస్తే కంటి తుడుపు చర్యగా మంగళ్‌పల్లి సమీపంలోని ఫిరంగి నాలాపై వేసిన రోడ్డును ధ్వంసం చేశారు. పైపులను తొలగించారు.. కానీ బఫర్‌ జోన్‌లో నిర్మించిన ప్రహరీని మాత్రం కూల్చకుండా రియల్టర్లకు వత్తాసు పలుకుతున్నారు. దీంతో చెరువులు, కుంటలకు నీరొచ్చే దారులు మూసుకుపోయి వాటి ఉనికి ప్రశ్నార్థకమవుతోందని స్థానికులు, చెరువు ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. 

కబ్జాలివి.. 

  • ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్‌ గ్రామంలో పెద్దబంధం వాగు నుంచి దాతర్‌ చెర్వులోకి నీరొచ్చే కాలువలను రియల్టర్లు పూర్తిగా కబ్జా చేశారు. ఏకంగా వాగుకు అడ్డంగా గోడను  నిర్మించి దాతర్‌చెర్వులోకి నీరు రాకుండా అడ్డుకట్ట వేశారు. ప్రక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కూడా రియల్టర్లు కబ్జా చేశారు. 
  • ఇక కొత్త చెర్వు, సింగరాయకట్టను పూర్తిగా తవ్వి కబ్జా చేశారు. వడ్లవాని కుంటలోకి వచ్చే వాగు, కన్నారపోని కుంటను పూర్తిగా కబ్జాకు గురి చేసి ప్లాట్లుగా మార్చారు.  
  • ప్రస్తుతం కలెక్టరేట్‌ నిర్మిస్తున్న భవన సముదాయానికి వెళ్లే దారిలోనే వడ్లవాని కుంటలోకి నీరొచ్చే కాలువను, వడ్లవాని కుంటను కబ్జా చేసి ప్లాట్లుగా మార్చారు.  
  • కొంగరకలాన్‌ నుంచి శేరిగూడ వరకు వచ్చే ఫిరంగి నాళాను కబ్జా చేశారు. మంగళ్‌పల్లి సమీపంలో ఫిరంగి నాలాపై ఏకంగా రోడ్డు వేసుకున్నారు. ఫిరంగి నాలా కట్టను ధ్వంసం చేసి దర్జాగా రహదారి నిర్మించారు. కాలువ పక్కనే బఫర్‌ జోన్‌ను విడిచిపెట్టకుండా ప్రహరీ నిర్మాణం చేపట్టారు. వర్షకాలంలో వాగులో నుంచి పెద్దగా నీరు వచ్చిందంటే గోడలు కూలిపోతాయి.  
  • నాలాకు ఇరువైపులా 9 మీటర్లు స్థలం బఫర్‌జోన్‌ కోసం వదిలేయాలి. కానీ ఎక్కడా ఇలా చేయడం లేదు. హెచ్‌ఎండీఏ అధికారులకు చూపించే ప్లాన్‌ ఒకటైతే స్థానికంగా చేసే పని వేరేలాగా ఉంటుంది.  
  • మంగళ్‌పల్లి సమీపంలో ఓ వెంచర్‌కు ఏకంగా కాలువ మీదంగానే రోడ్డు వేసుకొని వ్యాపారం చేసుకుంటున్నారు. కుమ్మరికుంట, కొమటికుంట కట్టలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఫిరంగి నాలా మీదుగానే పది కిలో మీటర్ల మేర అక్రమ కట్టడాలతో పాటు ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. 

చర్యలు తీసుకుంటాం 
అన్ని ప్రాంతాల్లో మా దృష్టికి వచ్చిన కబ్జాలపై స్పందిస్తున్నాం. ఇప్పటికే ఫిరంగి నాలాపై వేసిన రోడ్డును మంగళ్‌పల్లిలో రెండు చోట్ల తొలగించాం. మరెక్కడైనా చెరువులు, కుంటలు కబ్జాకు గురైతే మాకు ఫిర్యాదు చేయొచ్చు. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇందులో ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదు. 
– పరమేశ్వర్, డీఈఈ, ఇరిగేషన్‌ శాఖ 

కేసులు నమోదు చేస్తాం 
వాగులు, వంకలు, కాలువలు, చెరువులు, కుంటలు కబ్జాలకు గురయితే ఇరిగేషన్‌ అధికారులు మాకు ఫిర్యాదు చేస్తే తప్పకుండా స్పందిస్తున్నాం. రికార్డులు పరిశీలించి పరిరక్షణ చర్యలు చేపడుతాం. నోటీసులు ఇచ్చినా మార్పు రాకుంటే క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తాం. 
– వెంకటేశ్వర్లు, తహసీల్దార్, ఇబ్రహీంపట్నం 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top