శారీరక శ్రమకు దూరంగా యువత

The Lancet Survey Says That No Physical Exercise For Todays Teenagers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆడుతూ పాడుతూ శారీరకంగా అలసిపోవాల్సిన యువత.. ఎల క్ట్రానిక్‌ ప్రపంచంలో మునిగిపోతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటు న్నారు. ప్రపంచంలో ప్రతి ఐదుగురు టీనేజర్లలో నలుగురు సరైన వ్యాయామం చేయ ట్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని ‘ది లాన్సెట్‌’అనే సంస్థ 146 దేశాల్లో నిర్వహించిన సర్వేలో వెల్లడించింది. ముఖ్యంగా 11–17 ఏళ్ల వయసు గల విద్యా ర్థులపై ఈ సర్వే నిర్వహించింది. భారత్‌లో 72% మంది ఈ వయసు వారు వ్యాయామం చేయకపోవడంతో చురుగ్గా ఉండట్లేదని తేల్చింది.

శారీరక శ్రమను పెంచడానికి అత్యవసర చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, ఎముకలు, కండరాలు పటిష్టంగా ఉండాలంటే ఈ వయసులో కనీసం రోజుకు గంటపాటు కఠిన లేదా మితమైన వ్యాయామాలు చేయాలని సిఫార్సు చేసింది. దీంతో జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా పిల్లలను కాపాడుకోవచ్చని తెలిపింది. యువతకు ఆడుకునే హక్కుందని, ఆ హక్కును కల్పించాలని ఈ సర్వే సూచించింది.

బాలుర కంటే బాలికల్లో మరీ తక్కువ
‘బాలుర కంటే బాలికల్లో శారీరక శ్రమ ఇంకా తక్కువగా ఉంది. వారిని ఇంటికే పరిమితం చేయడం, బయటకు పంపడానికి అనువైన వాతావరణం లేకపోవడం వంటివి కారణాలు కనిపించాయి. సాంస్కృతిక సంప్రదాయాలు, భద్రతాపరమైన అంశాలు బాలికలకు ప్రతికూలంగా మారుతున్నాయి. బాలికల శ్రమ విషయంలో మన దేశం సహా బంగ్లాదేశ్‌ అత్యంత వెనుకబడి ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 2001లో బాలురలో 80 శాతం మంది శారీరక శ్రమకు దూరంగా ఉంటే, ఇప్పుడు 78 శాతానికి తగ్గింది. కానీ బాలికల్లో శారీరక శ్రమకు దూరంగా ఉన్నవారు.. అప్పుడూ ఇప్పుడూ 85 శాతం మందే ఉండటం గమనార్హం. అన్ని దేశాలు కౌమార దశలోని పిల్లల శారీరక శ్రమపై తమ విధానాలను అభివృద్ధి చేయాలి. అందుకు అవసరమైన వనరులను కేటాయించాలి’అని లాన్సెట్‌ నివేదిక కోరింది. డిజిటల్‌ టెక్నాలజీ కారణంగా ఎలక్ట్రానిక్‌ పరికరాలపై టీనేజర్లు ఎక్కువ సమయం గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

ఆట స్థలాలేవీ?
తెలంగాణలో 5 వేల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా, వాటిల్లో 15 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. దాదాపు 95 శాతం స్కూళ్లల్లో ఆట స్థలాలున్నాయి. అయితే రాష్ట్రంలో 10,549 ప్రైవేటు స్కూళ్లు ఉండగా, వాటిల్లో 31.21 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. 8,044 ప్రైవేటు స్కూళ్లల్లో మైదానాలు ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కానీ కాగితాలపైనే అవి ఉన్నాయని, 50 శాతం పైగా ప్రైవేటు స్కూళ్లల్లో ఆట స్థలాలు లేవని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు 404 ఉండగా, 1,500 ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలున్నాయి. వాటిల్లో 10 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 80 శాతం ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో మైదానాల్లేవు. కారణంగా విద్యార్థులు ఆటలు ఆడటం కష్టమవుతోంది. దీంతో పిల్లలపై జీవనశైలి వ్యాధులు దాడి చేస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం దేశంలో 10–19 ఏళ్ల మధ్య పిల్లల్లో 5 శాతం మంది బీపీతో బాధపడుతుండగా, తెలంగాణలో ఏకంగా 6.7 శాతం ఉండటం ఆందోళనకరం.

అదే వయసు పిల్లల్లో మధుమేహంతో బాధపడేవారు దేశంలో 0.6 శాతం మంది ఉండగా, తెలంగాణలో 1.1 శాతం మంది ఉన్నారు. ఆ వయసు పిల్లల్లో దేశంలో తెలంగాణ బీపీ విషయంలో 5వ స్థానం, మధుమేహంలో 9వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 8.6 శాతం మంది ప్రీ డయాబెటిక్‌తో బాధపడుతున్నారని తేల్చింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top