ఉపాధిహామీ కూలీలు కొలతల ప్రకారం పనిచేస్తే గిట్టుబాటు కూలీ లభిస్తుందని కలెక్టర్ శ్రీదేవి వివరించారు.
ఉపాధి పనులను పరిశీలించిన కలెక్టర్
కొందుర్గు: ఉపాధిహామీ కూలీలు కొలతల ప్రకారం పనిచేస్తే గిట్టుబాటు కూలీ లభిస్తుందని కలెక్టర్ శ్రీదేవి వివరించారు. బుధవారం మండలంలోని చేగిరెడ్డిఘనాపూర్ గ్రామశివారులో ఉపాధిహామీ పథకంలో చేపడుతున్న డంప్‌యార్డు పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీల నుంచి పనులు జరుగుతున్న విధానం, కూలీ అందుతున్న తీరు, పొదుపు తదితర విషయాలను తెలుసుకున్నారు.
అనంతరం గ్రామంలో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాన్ని పరిశీలించారు. నూతన భవనం మంజూరుచేసేందుకు కృషిచేస్తానన్నారు. వీరసముద్రం నుంచి చేగిరెడ్డిఘనాపూర్ రోడ్డు వేయించాలని పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి వివరించగా సానుకూలంగా స్పందించారు. తండాల్లో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎంపీపీ మంగులాల్‌నాయక్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సమస్యలపై వెంటనే సర్వేలు రిపోర్టులు పంపాలని ఎంపీడీఓ శ్రీనివాసాచార్యా, తహశీల్దార్ సంగీతకు సూచించారు.
మండలంలోని లాల్‌పహడ్ కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ శ్రీదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురు విద్యార్థులతో హిందీపాఠం చదివించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులను మందలించారు. మరోసారి ఇలాంటి సమస్యలు ఎదురైతే సహించేది లేదని హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఎంపీపీ ఆవుల గాయత్రి, డ్వామా పీడీ సునంద, తహశీల్దార్ సంగీత, ఎంపీడీఓ శ్రీనివాసాచార్యా, ఈఓఆర్డీ మహేష్‌బాబు, ఏపీఓ అరుణారాణి ఉన్నారు.