త్వరలో అందుబాటులోకి పంజగుట్ట స్టీల్‌ బ్రిడ్జి

KTR Visit Punjagutta Steel Bridge Works - Sakshi

లాక్‌డౌన్‌తో పనులు మరింత వేగవంతం   

మే నెలాఖరులోగా పూర్తి చేసేలా చర్యలు  

నిర్మాణాన్ని తనిఖీ చేసిన మంత్రి కేటీఆర్‌

మరో స్టీల్‌ బ్రిడ్జి, రోడ్డు విస్తరణ కూడా..

ప్రాజెక్టు మొత్తం అంచనా రూ.23 కోట్లు

సాక్షి,సిటీబ్యూరో: తీవ్ర ట్రాఫిక్‌ సమస్యలతో ప్రయాణికులకు అత్యంత ప్రమాదకరంగా ఉన్న పంజగుట్ట శ్మశానవాటిక వద్ద ట్రాఫిక్‌ కష్టాలను తీర్చేందుకు ఎస్సార్‌డీపీ పనుల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ చేపట్టిన స్టీల్‌ బ్రిడ్జి పనులు త్వరలో పూర్తి కానున్నాయి. కాంట్రాక్టు అగ్రిమెంట్‌ మేరకు ఈ పనులు పూర్తయ్యేందుకు సమయం ఉన్నప్పటికీ, లాక్‌డౌన్‌ కాలాన్ని సద్వినియోగం చేసుకొని ఇంజినీరింగ్‌ పనుల్ని త్వరితగతిన పూర్తిచేయాలని మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. యంత్రాలు, కార్మికుల సంఖ్యను పెంచి మరీ పనులు త్వరితంగా పూర్తిచేయాలన్నారు. దీంతో మే నెలలోగా పనులు పూర్తి చేసేందుకు అధికారులు వేగం పెంచారు. సోమవారం పంజగుట్ట శ్మశాన వాటిక వద్ద ముఫకంజా కాలేజి వైపు నుంచి నాగార్జున సర్కిల్‌ వైపు స్టీల్‌బ్రిడ్జి పనుల పురోగతిని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఎమ్మెల్యే  దానం నాగేందర్, మేయర్‌ బొంతు రామ్మోహన్‌లతో కలిసి తనిఖీ చేశారు. 

పనుల్ని త్వరితగతిన పూర్తిచేయాల్సిందిగా చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీధర్‌కు మంత్రి కేటీఆర్‌ సూచించారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో ట్రాఫిక్‌ సమస్యలు లేనందున త్వరితంగా పూర్తిచేసేందుకు మంచి అవకాశమని, కాంట్రాక్టు ఏజెన్సీ ఎక్కువమంది కార్మికులను వినియోగించేలా చూడాలన్నారు. మేయర్‌ మాట్లాడుతూ.. నిత్యం అత్యంత రద్దీగా వుండే ఈ ప్రాంతంలో శ్మశాన వాటిక– చట్నీస్‌  మధ్యలో ఇరుగ్గా ఉన్న పంజగుట్ట రహదారిని రెండు వైపులా విస్తరించేందుకు ఎస్సార్‌డీపీ కింద ప్రభుత్వం పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ పీరియడ్‌లో ఏర్పడిన వెసులుబాటును ఉపయోగించుకొని నిర్మాణ పనులను 24 గంటల పాటు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ çపనుల్లో భాగంగా రోడ్డుకు రెండు వైపులా రెండు లేన్ల ర్యాంపులు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్మశాన వాటిక వైపు ఉన్న సమాధులకు నష్టం వాటిల్లకుండా మధ్యలో 43 మీటర్ల పొడవుతో స్టీల్‌ బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు తెలిపారు.

ట్రాఫిక్‌ చిక్కులకు ఉపశమనం  
పంజగుట్ట శ్మశానవాటిక వద్ద తీవ్ర బాటిల్‌నెక్‌తో బ్లాక్‌స్పాట్‌గా మారిన ప్రదేశంలో ట్రాఫిక్‌ రద్దీకి అనుగుణంగా తగినంత వెడల్పుతో రోడ్డును విస్తరించేందుకు అవకాశం లేకపోవడంతో ఒక స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. దాదాపు 100 మీటర్ల పొడవుతో జరుగుతున్న పనుల్లో స్టీల్‌ బ్రిడ్జి పొడవు 43 మీటర్లు ఉంటుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రోడ్డు 5 మీటర్ల వెడల్పుతో, రోడ్డుపై బ్రిడ్జి 6 మీటర్ల వెడల్పుతో మొత్తం 11 మీటర్ల క్యారేజ్‌వే అందుబాటులోకి వస్తుందని ఎస్‌ఈ జ్యోతిర్మయి తెలిపారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే ముఫకంజా కాలేజ్‌ వైపు నుంచి నాగార్జున సర్కిల్‌ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్‌ చిక్కులు  తగ్గుతాయన్నారు. 

మరో స్టీల్‌ బ్రిడ్జి ..
నాగార్జున సర్కిల్‌ నుంచి ముఫకంజా కాలేజీ వైపు వెళ్లే మార్గంలో ఉన్న శ్మశాన వాటికలోకి వెళ్లే వారికి ఇబ్బంది లేకుండా నేరుగా వెళ్లేందుకు 65 మీటర్ల పొడవుతో మరో స్టీల్‌బ్రిడ్జి నిర్మించనున్నారు. శ్మశానవాటిక ఎగ్జిట్‌ దారిని అభివృద్ధి చేయనున్నారు. భూసేకరణలతో సహా వీటి అంచనా వ్యయం దాదాపు రూ.17 కోట్లు. రెండు స్టీల్‌ బ్రిడ్జిలు సహా మొత్తం ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.23 కోట్లు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top