
సాక్షి, హైదరాబాద్ : కశ్మీర్ విభజన అంశం ట్వీట్ల వార్‌కు దారి తీస్తోంది. ఈ విభజనను వ్యతిరేకించే పాకిస్తానీలు భారత నాయకులపై ట్వీట్ల రూపంలో ద్వేషాన్ని చిమ్ముతున్నారు. వారి కామెంట్లు మన నాయకులకు ట్యాగ్ చేస్తూ తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. తాజాగా పలువురు పాక్ నెటిజన్లు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు, బీజేపీ నాయకురాలు కరుణాగోపాల్‌ను తమ ట్వీట్లతో విసిగించాలని చూసి భంగపాటుకు గురయ్యారు. షోయబ్ అన్సారీ అనే పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ సానుభూతిపరుడు కశ్మీర్‌ను విభజించిన పాపం.. కేంద్రానికి తగిలింది అందుకే, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ ఆకస్మికంగా మరణించారంటూ ట్వీట్ చేస్తూ శాపనార్థాలు పెట్టాడు. దీనికి కేటీఆర్ కూడా దీటుగానే స్పందించారు.
‘ఒక నాయకురాలి మరణంపై ఇంత దారుణంగా స్పందించిన మీ సంకుచిత మనస్తత్వం మీ ట్వీట్లతో బయటపడింది. నువ్వు పాకిస్తాన్‌కు చెందిన వాడివైనా సరే.. జీవితాంతం ప్రజాసేవకు పాటుపడ్డ సుష్మాస్వరాజ్ లాంటి వారిని చూసి కాస్త ధైర్యం, మర్యాద, హుందాతనం నేర్చుకో..’అంటూ చురకలంటించారు. నాజియా అనే మరో నెటిజన్ దేవుడి దయ వల్ల సుష్మాస్వరాజ్ ఇప్పటికే నరకంలోకి వెళ్లి ఉంటుంది, తర్వాత వంతు నరేంద్రమోదీదే అంటూ బీజేపీ నాయకురాలు కరుణాగోపాల్‌ను వెక్కిరిస్తూ ట్యాగ్ చేసింది. దీనికి కరుణాగోపాల్ కూడా అదేస్థాయిలో సమాధానమిచ్చింది. మీలాంటి మనస్తత్వం ఉన్న వారు ఎన్నటికీ మారరు అంటూ ప్రతిస్పందించి ఆమె నోరు మూయించింది.