ఇదేం పని?

KTR Fire On Officer In Twitter Hyderabad - Sakshi

పాట్‌హోల్‌ పనులపై కేటీఆర్‌ అసంతృప్తి

ట్విట్టర్‌ వేదికగాఅధికారిపై ఆగ్రహం

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రజలు ట్విట్టర్‌ వేదికగా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. వీటిని సత్వరం పరిష్కరించాలని మంత్రి కేటీఆర్‌ ఇదివరకే ఆదేశించారు. అయితే వీటిని వెనువెంటనే పరిష్కరించకపోతే మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్తుందని భావించి చాలామంది జీహెచ్‌ఎంసీ అధికారులు.. సమస్య పరిష్కారం కాకపోయినప్పటికీ, అయినట్టు పేర్కొంటున్నారు. అలాంటి వ్యవహారం ఒకటి తాజాగా కేటీఆర్‌ దృష్టికి రావడంతో ‘ఇదేం పని..?’ అంటూ సంబంధిత అధికారిపై మండిపడ్డారు. ఉప్పర్‌పల్లి నలందనగర్‌ స్ట్రీట్‌ నెం.8లో రోడ్డుపై గుంతలు (పాట్‌హోల్స్‌) ఉన్నాయి.

వీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సాయి కౌశిక్‌ అనే పౌరుడు జీహెచ్‌ఎంసీ ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశాడు. దీనికి స్పందిస్తూ సంబంధిత ఏఈ (వార్డు 61–రాజేంద్రనగర్‌) సమస్యను పరిష్కరించామని.. పనులు జరుగుతున్న ఫొటోలతో అతనికి రిప్‌లై ఇచ్చారు. మీ ఫిర్యాదుతో పాటు మరికొన్ని కూడా పూడ్చినట్లు కూడా అందులో పేర్కొన్నారు. రోడ్డుపై పాట్‌హోల్స్‌ పూడ్చేందుకు చేసిన సదరు పని మొత్తం పూర్తికాకముందే సమస్య పరిష్కారమైనట్లు పేర్కొనడాన్ని మంత్రి తప్పుబట్టారు. రోడ్డుపై తారును పూర్తిగా చదును చేయకపోవడాన్ని గుర్తించి, తారు కాంపాక్ట్‌ కాకుండానే నిలుస్తుందని ఎలా అనుకుంటున్నారు అంటూ తప్పుబట్టారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్, సీఈలకు రీట్వీట్‌ చేశారు.

అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేటీఆర్‌ ట్వీట్‌ , ట్విట్టర్‌లో ఏఈ పోస్ట్‌ చేసిన చిత్రాలు..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top