గులాబీకి గుడ్‌బై | Konda Visweswar Reddy said Good Bye to TRS | Sakshi
Sakshi News home page

గులాబీకి గుడ్‌బై

Nov 21 2018 1:36 PM | Updated on Nov 21 2018 2:08 PM

ఱస్Konda Visweswar Reddy said Good Bye to TRS - Sakshi

కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

అడుగడుగునా నాకు అవమానాలు జరిగాయి. నా ప్రతిపాదనలను అధికారులు పట్టించుకోవద్దని మంత్రి మౌఖిక ఆదేశాలు జారీచేశారు. ఇక పార్టీలో ఇమడలేను. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించారు.  – ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎన్నికల వేళ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌ తగిలింది. కొన్నాళ్లుగా పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మంగళవారం పార్టీకి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ముఖ్యంగా తాజా మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి వ్యవహారశైలితో కినుక వహించిన ఆయన.. కొన్ని రోజులుగా పార్టీ మార్పుపై సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారం రోజుల క్రితం మంత్రి కేటీఆర్‌ బుజ్జగించినప్పటికీ శాంతించని ఆయన పార్టీని వీడేందుకే మొగ్గుచూపారు. 2013లో టీఆర్‌ఎస్‌లో చేరిక ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన కొండా.. గత ఎన్నికల్లో చేవెళ్ల నుంచి విజయం సాధించి లోక్‌సభలో అడుగు పెట్టారు. మారుమూల గ్రామం మొదలు.. ఐటీ హబ్‌గా పేరెన్నికగన్న అతిపెద్ద సెగ్మెంట్‌ నుంచి పోటీచేసిన తొలిసారే గెలుపొందడం ద్వారా ఆయన రికార్డు సృష్టించారు. 

ఇమడలేక.. 
గత నాలుగేళ్లుగా జిల్లాలో జరుగుతున్న పరిణామాలతో కొండా కలత చెందారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినవారికీ గాకుండా.. ఉద్యమాన్ని అణిచివేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ అంశంపై పలుమార్లు నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసిన ఆయన పార్టీ లైన్‌ను మాత్రం దాటలేదు. జిల్లా వ్యవహారాలను మంత్రి మహేందర్‌రెడ్డి శాసిస్తుండడం ఆయనకు పార్టీ పెద్దలు కూడా అండగా నిలవడంతో తట్టుకోలేకపోయారు. అడుగడుగునా తనకు అవమానాలు జరిగాయని, పలుమార్లు మహేందర్‌ పెత్తనంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా సర్దుకుపోవాలని పార్టీ పెద్దలు సూచించడంతో ఆవేదనకు గురయ్యారు. ఈ క్రమంలోనే మంత్రి, కొండా మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇరువురిదీ ఒకే నియోజకవర్గం కావడంతో మనస్పర్థలు మరింత ముదిరాయి. తన ప్రతిపాదనలను అధికారులు పట్టించుకోవద్దని మంత్రి మౌఖిక ఆదేశాలు జారీచేశారని అనుమానించిన ఆయన ఇక పార్టీలో ఇమడలేనని బయటకు వచ్చారు. అంతేకాకుండా పుప్పాలగూడలోని తన భూమిని మంత్రి వివాదాస్పదం చేశారని ఆయన వాపోయారు.

పైలెట్‌ తొలగింపుతో.. 
వాస్తవానికి మాజీ మంత్రి సబిత, మహేందర్‌రెడ్డి కుటుంబాల రాజకీయ పెత్తనానికి గండికొట్టాలని ఆయన రాజకీయాల్లోకి వచ్చినట్లు అంతర్గతంగా చెబుతుంటారు. అయితే, పార్టీ తీర్థం పుచ్చుకున్న కొన్నాళ్లకే మహేందర్‌రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌ గూటికి చేరడంతో అనివార్యంగా కలిసి ముందుకుసాగారు. అయితే, మహేందర్‌కు మంత్రివర్గంలో చోటు దక్కడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అసహనానికి గురైన ఆయన రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశానన్న భావనను కూడా తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారు. అయిష్టంగానే నెట్టుకొస్తున్న ఆయనకు జిల్లాలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగించాయి. తా ను సూచించినవారికి పదవులు దక్కకుండా తన అనుచరులను ఆకారణంగా బహిష్కరించడం వి శ్వేశ్వర్‌రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. ప్రధానంగా తాండూరు టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జీగా వ్యవహరించిన పైలెట్‌ రోహిత్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చే యడం కలిచివేసింది.

పార్టీ ఆవిర్భావం నుంచి ప నిచేస్తున్న పైలెట్‌తో పాటు మరికొందరు కా ర్యకర్తలపై కేసులు పెట్టి వేధించడమేగాకుండా పా ర్టీ నుంచి తరిమివేయడాన్ని బహిరంగంగానే తప్పుబట్టారు. దీంతో పతాకస్థాయికి చేరిన అ భిప్రాయభేదాలు ఇటీవల కోట్‌పల్లి ప్రాజెక్టులో బోట్‌ నిర్వాకులపై దాడిచేసిన వారికి మంత్రి అండగా నిలవడంతో మరింత పెరిగాయి. ఈ క్ర మంలోనే పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయించిన ఆయన తొలుత బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఇటీవల కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపుతున్నారని సంకేతాలందాయి. అయితే, కొన్నాళ్ల క్రితం కేటీఆర్‌తో భేటీ విశ్వేశ్వర్‌రెడ్డి ఈ వార్తలను ఖండించినప్పటికీ మంగళవారం పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా సమర్పించడంతో ఆయన అసంతృప్తి తేటతెల్లమైంది. ఈ నెల 23న మేడ్చల్‌లో జరిగే సోనియా, రాహుల్‌గాంధీ పర్యటనలో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని తెలుస్తోంది. దీనిపై బుధవారం నిర్వహించే విలేకర్ల సమావేశంలో స్పష్టం చేసే అవకాశముంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement