ఎంజీఎం అధికారుల తీరుతోనే తాళం

KMC Doctors Locked MGM Mortuary Gate In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆస్పత్రిలోని పోస్టుమార్టం నిర్వహించే మార్చురీకి వచ్చే మృతుల బంధువులకు సమస్యలు తప్పడంలేదు. ఆస్పత్రి అధికారులకు, ఫోరెన్సిక్‌ వైద్యసిబ్బందికి మధ్య తలెత్తిన వివాదం కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. ఎంజీఎంలో మృతి చెందిన రోగులను పోస్టుమార్టం నిర్వహించే మార్చురీకి పిల్లల విభాగం మీదుగా తరలిస్తారు. అయితే ఆస్పత్రి వెనుకభాగంలో ఉన్న పోస్టుమార్టం విభాగానికి పీడియాట్రిక్‌ విభాగానికి మధ్య ఓ గేటు ఉంటుంది. బుధవారం ఉదయం ఈ గేటుకు ఫోరెన్సిక్‌ విభాగం వైద్యనిపుణులు తాళం వేయడంతో మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలిచేందుకు బంధువులు మూడు గంటల పాటు పడిగాపులు కాయాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న అధికారులు చివరకు అంబులెన్స్‌ సాయంతో మార్చురీకి తరలించారు. 

అధికారుల నడుమ వివాదం
పోస్టమార్టం ప్రాంగణం ఎంజీఎం ఆవరణలో ఉండగా ఇందులో విధులు నిర్వర్తించే వైద్యులకు సంబంధించిన ఫోరెన్సిక్‌ విభాగం కేఎంసీ పరిధిలో ఉంటుంది. అయితే పోస్టుమార్టానికి అవసరమైన గ్లౌజులు, సిరంజ్‌లు ఇతర సామగ్రి ఎంజీఎం ఆస్పత్రి నుంచే సరఫరా అవుతాయి. మార్చురీలో వసతులు సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత కేఎంసీ అధికారులదే.  ఈ విషయంలో నెలకొన్న వివాదం గేటుకు తాళం వేసే వరకు వచ్చింది.

ఎంజీఎం అధికారుల తీరుతోనే తాళం వేశాం
పోస్టుమార్టం నిమిత్తం ఉపయోగించే గ్లౌజులు, సిరంజిలు తదితర సామగ్రిని కొన్నేళ్లుగా ఎంజీఎం ఆస్పత్రి అధికారులే సరఫరా చేస్తున్నారు. అయితే ఈ సామగ్రిని అందించమని కేఎంసీ నుంచి తెచ్చుకోవాలని సోమవారం పేర్కొన్నారు. అంతే కాకుండా పోస్టుమార్టం మీదుగా ఉన్న గేటు కారణంగా అనవసర రాకపోకలు జరుగుతున్నాయి. అలాగే ఈ ప్రాంగణాన్ని మలమూత్ర విసర్జనకు ఉపయోగిస్తుండడంతో తాళం వేశాం..
– రజామ్‌ ఆలీఖాన్, ఫోరెన్సిక్‌ వైద్య నిపుణులు

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం..
మార్చురీ ప్రాంగణానికి హద్దుగా ఉన్న గేటుకు తాళం వేసిన విషయాన్ని కేఎంసీ ప్రిన్సిపాల్‌తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మార్చురీకి అవసరమున్న గ్లౌజులు అన్ని రకాల వస్తువులు అందిస్తున్నాం. ఫర్నిచర్‌ విషయంలో మాత్రమే వ్యతిరేకించడం.. ఉన్నతాధికారుల జోక్యంతో గేట్‌కు తాళం తీసాం. 
– శ్రీనివాస్, సూపరింటెండెంట్‌

మృతదేహంతో పడిగాపులు
మా సోదరి కాలిన గాయాలతో బుధవారం ఉదయం 9 గంటలకు మృతి చెందింది. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాతే మృతదేహాన్ని అప్పగిస్తామన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు మృతదేహంతో గేట్‌ వద్దే ఉన్నాము. అయినా తాళం తీయలేదు. మట్టెవాడ పోలీసులకు చెప్పిన తర్వాత ఎంజీఎం అధికారులు స్పందించి అంబులెన్స్‌ ద్వారా పోస్టుమార్టానికి తరలించారు. చివరకు నాలుగు గంటలకు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అప్పగించారు.
– రాజు, మృతుడి బంధువు 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top