అది ఆకతాయిల పనే!

Kishan Reddy Relative Car Attack Mystery Reveals - Sakshi

కిషన్‌రెడ్డి బంధువు కారుపై దాడి చేసింది వారే

సీసీ కెమెరాల ఆధారంగా నిర్ధారించిన టాస్క్‌ఫోర్స్‌

నలుగురు బాలల పట్టివేత

సాక్షి, సిటీబ్యూరో: మలక్‌పేట ఠాణా పరిధిలో చోటు చేసుకుని నగర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీజేపీ సీనియర్‌ నేత కిషన్‌రెడ్డి సమీప బంధువు కారు అద్దాల ధ్వంసం కేసు కొలిక్కి వచ్చింది. ఈ ఘటన వెనుక ఎలాంటి కుట్ర లేదని, వాస్తవానికి అది పథకం ప్రకారం చేసిన దాడి కాదని ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం నిర్ధారించారు. ఈ పని చేసిన నలుగురు ఆకతాయి బాలలను మలక్‌పేట పోలీసుల సహకారంతో పట్టుకున్నారు. కిషన్‌రెడ్డి సమీప బంధువైన శ్రీనివాసరెడ్డి సచివాలయంలో అధికారిగా పని చేస్తూ మలక్‌పేటలోని ప్రభుత్వ క్వార్టర్స్‌ బి–బ్లాక్‌లో నివాసం ఉంటున్నాడు. శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు అతని కారు అద్దాలు, బైక్‌ ధ్వంసం చేశారు.

ఇది ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసిన దాడిగా భావించిన ఆయన మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కిషన్‌రెడ్డి సీపీతో పాటు రాష్ట్ర డీజీపీని కలిశారు. సున్నితమైన ఈ అంశానికి సంబంధించిన చిక్కుముడి విప్పడానికి కీలక ప్రాధాన్యం ఇచ్చిన ఉన్నతా«ధికారులు ఆ బాధ్యతలు ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించారు. ఘటన జరిగిన ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న సీసీ కెమెరా పుటేజీని అధ్యయనం చేసిన  పోలీసులు అదే సమయంలో నలుగురు బాలలు ఆ ప్రాంతాల్లో తచ్చాడినట్లు గుర్తించారు. ఈ ఆధారంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం మలక్‌పేట అధికారుల సాయంతో ముమ్మరంగా గాలించారు. ఫలితంగా బాధ్యులైన నలుగురు మైనర్లను మంగళవారం పట్టుకున్నారు. విచారణ నేపథ్యంలోనే ఈ ఉదంతం వెనుక ఎలాంటి కుట్ర, రాజకీయ కోణాలు లేవని తేలింది. కేవలం ఆకతాయితనంతోనే వీరు కారు అద్దాలు, ఓ బైక్‌ను ధ్వంసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top