బ్రేక్‌ 'కరోనా'

Kerala IAS Officer Divya Awareness on Handwash And Sanitizers - Sakshi

ఐక్యత సాధన కోసం దేశంలోని మనుషులందరూ చేయి చేయి పట్టుకుని సంఘీభావం ప్రకటిస్తారు. కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలోదేశానికి అవసరమైంది ఆరోగ్యసాధన.కరోనాను తరిమి కొట్టడానికి మనుషుల మధ్య చేయి చేయి కలవని సమైక్యత కావాలి. ఆ సమైక్యత సాధన కోసం కేరళ ఆరోగ్యమంత్రి శైలజ ప్రారంభించిన‘బ్రేక్‌ ద చైన్‌’ ప్రచారాన్ని ఐఏఎస్‌ ఆఫీసర్‌దివ్య... క్షేత్రస్థాయికి తీసుకెళ్లారు.

కోవిడ్‌ – 19ను తరిమి కొట్టడానికి కేరళ రాష్ట్రం వేసిన ముందడుగు ఇది. ఈ నెల ఇరవై నాలుగోతేదీ నాటికి కేరళలో నిర్ధారణ అయిన కరోనా బాధితులు 87 మంది. కరోనా మీద యుద్ధాన్ని ప్రకటించిన కేరళ ప్రభుత్వం ఇరవై వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజ్‌ ప్రకటించింది. ఈ రోజుల్లో పనులకు వెళ్లలేని వారికి పెన్షన్‌లు, మహాత్మాగాంధీ రూరల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్‌ స్కీమ్‌ కింది ఆహారధాన్యాలు, సబ్సిడీ ధరలతో భోజనం ఇవ్వడం వంటి సంక్షేమ కార్యక్రమాలను మొదలు పెట్టింది. అంతకంటే ముఖ్యంగా కరోనా గురించిన అవగాహన కోసం హెల్త్‌ టీమ్‌లు మారుమూల గ్రామాల్లో కూడా పర్యటిస్తున్నాయి. పరిశుభ్రత గురించి, హ్యాండ్‌ వాష్‌ లిక్విడ్‌ సోప్‌లు, హ్యాండ్‌ శానిటైజర్ల వాడకం గురించి చైతన్యవంతం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి కె.కె. శైలజ ‘బ్రేక్‌ ద చైన్‌’ ప్రచారానికి నాంది పలికారు.

హ్యాండ్‌ వాష్‌ సెంటర్‌లు
ప్రయాణాల్లో రైలు, బస్సులు, ఆటోలను పట్టుకున్న చేతులను వెంటనే శుభ్రం చేసుకోవడానికి వీలుగా రైల్వే స్టేషన్‌లు, బస్టాపుల్లో హ్యాండ్‌ వాషింగ్‌ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. బస్సు దిగగానే పక్కనే ఉన్న అవుట్‌లెట్‌లో హ్యాండ్‌ వాష్‌ లిక్విడ్‌తో చేతులు కడుక్కుని తమ పనుల కోసం ముందుకు సాగవచ్చు. ఇలాంటి అవుట్‌ లెట్‌లను ప్రభుత్వ ఆఫీసులు, హాస్పిటళ్లలో కూడా ఏర్పాటు చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి చేతులను శుభ్రంగా ఉంచుకోవడం ఒక ఉత్తమమైన మార్గమని చెప్పారు మంత్రి శైలజ. ఇది ఒక అలవాటుగా మారాలని కూడా చెప్పారామె. ప్రతి ఒక్కరూ ఈ నియమాన్ని పాటించినప్పుడు వైరస్‌ వ్యాప్తిని నివారించవచ్చని చెప్పారు.

మారుమూల ప్రచారం
మరి... ఈ హ్యాండ్‌ వాష్‌ అవుట్‌లెట్‌లు నగరాలు, పట్టణాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. బ్రేక్‌ ద చైన్‌ ప్రచారాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లకపోతే కరోనా వైరస్‌ లింక్‌ను తెగ్గొడడం ఎలా? ఇందుకు పూనుకున్న ఐఏఎస్‌ అధికారి ఓ మహిళ. ఆమె పేరు డాక్టర్‌ దివ్య ఎస్‌ అయ్యర్‌. మహాత్యాగాంధీ నేషనల్‌ రూరల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ గ్యారంటీ స్కీమ్‌ నిర్వహణ బాధ్యత ఆమెదే. దివ్య ఈ బ్రేక్‌ ద చైన్‌ ప్రచార కార్యక్రమాన్ని గ్రామాలకు తీసుకెళ్లారు. రాష్ట్రంలో పదహారు లక్షల మందికి పైగా గ్రామీణులు ఈ ప్రోగ్రామ్‌తో అనుసంధానమై ఉన్నారు. వీళ్లంతా రాష్ట్ర వ్యాప్తంగా 38 వేల ప్రదేశాల్లో విస్తరించి ఉన్నారు. అందులో ఎక్కువ మంది యాభై ఏళ్లు దాటిన వాళ్లే. అంటే కరోనా వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నవాళ్లే. దివ్య ఆయా ప్రదేశాల్లో పర్యటించి రోజువారీ పనులు చేసుకుని జీవించే గ్రామీణ మహిళలకు కరోనా వ్యాధి, తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. వాళ్ల చేతుల్లో హ్యాండ్‌ వాష్‌ లిక్విడ్‌ స్వయంగా వేస్తున్నారు.

‘‘నేను కల్లిక్కాడ్‌ గ్రామంలో పర్యటించినప్పుడు మహిళలు చురుగ్గా ముందుకు వచ్చి ఈ క్యాంపెయిన్‌లో పాలుపంచుకున్నారు. ఇళ్లలో లిక్విడ్‌ హ్యాండ్‌ వాష్‌లు లేని వాళ్లు స్నానానికి ఉపయోగించే సబ్బుతో గంటకోసారి చేతులు కడుక్కుంటున్నట్లు తెలియచేశారు. పనులకు వెళ్లేటప్పుడు కూడా సబ్బు ముక్క తీసుకెళ్లి చేతులు కడుక్కుని భోజనం చేస్తున్నారని తెలిసింది. గ్రామీణ మహిళలు నేను అనుకున్న దానికంటే ఎక్కువ చైతన్యవంతంగా ఉన్నారు. మీడియా విస్తృతంగా ప్రచారం చేయడం కూడా ఇందుకు కారణమే. పని చేసేటప్పుడు గ్లవ్స్‌ ధరించాలని చెప్పినప్పుడు మాత్రం వారిలో పెద్దగా సుముఖత వ్యక్తం కాలేదు. వాళ్లు సమాధానపడే వరకు నచ్చచెప్పాల్సి వచ్చింది. ఈ ప్రచారంలో మహిళలను చైతన్యవంతం చేసే బాధ్యతను మాత్రమే నేను స్వయంగా తీసుకున్నాను. ఒక మహిళ తాను నేర్చుకున్న విషయాన్ని ఇంట్లో వాళ్లకు నేర్పించి తీరుతుంది. అంటే ఈ ప్రచారానికి అసలైన వారథులు ఈ మహిళలే’’ అన్నారు డాక్టర్‌ దివ్య.– మంజీర

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top